బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక టీఆర్పీ రేటింగ్, ఓటింగ్ నమోదు కావడమే దీనికి నిదర్శనం. మూడో వారం పూర్తి చేసుకోబోతోన్న ఈ అతిపెద్ద రియాల్టీ షో నుంచి ఇప్పటివరకు ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. సీనియర్లు సూర్య కిరణ్, కరాటే కళ్యాణి హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ ఇద్దరిలో సూర్యకిరణ్ ఎలిమినేట్ అవ్వడం ఎవ్వరినీ ఆశ్చర్యపర్చలేదు. అయితే రెండో వారం కరాటే కళ్యాణి ఎలిమినేట్ కావడం కొందరు ఊహించలేకపోయారు. అయితే తను ఎలిమినేట్ కావడానికి గల కారణాలను తాజాగా కరాటే కళ్యాణి అభిమానులతో పంచుకున్నారు.
‘నేను బిగ్‌బాస్ హౌజ్‌లో ఏడ్వడం నా అభిమానులతో పాటు బిగ్‌బాస్ ప్రేక్షకులకు నచ్చలేదు. అందుకే నన్ను త్వరగా ఎలిమినేట్ చేశారు. ఇక బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్న మిగతా కంటెస్టెంట్‌లు నా కన్నా చాలా చిన్నవారు(గంగవ్వ మినహా). దీంతో వారి ఆలోచన విధానం, నా ఆలోచన విధానం వేరుగా ఉండటంతో వారితో ఇమడలేకపోయాను. నేను ఉన్నన్ని రోజులు పని, వంట చేసి పెడితే నన్ను జీరోను చేసి ఎలిమినేట్ చేశారు.
అలాంటప్పుడు నేను హౌజ్‌లో ఉండటం కంటే బయటకు రావడమే బెటర్ అనుకున్నాను. అందుకే సెల్ఫ్ నామినేషన్ చేసుకొని బయటకు వచ్చాను’ అంటూ కరాటే కళ్యాణి చెప్పుకొచ్చింది. ఇక కంటెస్టెంట్‌లు సెల్ఫ్ నామినేషన్ కావడం పట్ల బిగ్‌బాస్‌తో పాటు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో డబుల్ ఎలిమినేషన్ అంటూ చిన్న ఝలక్ ఇచ్చాడు.