బిగ్ బాస్ షోలో నిన్న ఓ అపురూపమైన ఘట్టం చవిచూసింది. కంటెస్టెంట్లకు దూరమైన తల్లి ప్రేమను మళ్లీ రుచిచూపించాడు. దాదాపు రెండున్నర నెలలు అమ్మకు దూరంగా ఉన్న కంటెస్టెంట్లకు వాళ్ల అమ్మను చూపించాడు. ఎమోషనల్ అయ్యేలా చేశాడు. అయితే గతంలో మాదిరి తల్లి, తండ్రి వచ్చారని కంటెస్టెంట్లు భోరున ఏడ్చి విసుగుపుట్టించలేదు. పైగా గత సీజన్లో నేరుగా కలిసే అవకాశం వచ్చింది. ఈ సారి కోవిడ్ నిబంధనలు మూలంగా భౌతికంగా కలిసే అవకాశం ఇవ్వలేదు.
అలా గాజు రూంలో బంధించి చూపించాడు. మాటలు మాట్లాడుకునే అవకాశాన్ని ఇచ్చాడు. మొదటగా అఖిల్ తల్లి దుర్గ ఎంట్రీ ఇచ్చారు. వస్తూనే ఇంట్లోకి ఓ పాజిటివిటీని తీసుకొచ్చారు. అఖిల్ కంటే ఎక్కువగా మిగతా ఇంటి సభ్యుల గురించి మాట్లాడారు. ప్రతీ ఒక్కరిని పేరు పేరును పలకరిస్తూ వారి విశిష్టతను చెప్పారు. అరియానా గడుసరి పిల్లా అని, అవినాష్ తెగ నవ్విస్తున్నాడని ఇలా అందరి గురించి చెప్పింది. అందరి కంటే ఎక్కువగా అభిజిత్ హారికల గురించే చెప్పింది.
అభిజిత్‌కు అఖిల్ బాధ్యతలు అప్పజెప్పింది.. నీ బ్రదర్‌ను బాగా చూసుకో అని చెప్పింది. ఆ తరువాత హారికను పొగడ్తలతో ముంచెత్తింది. మా ఇంట్లో ఆడపిల్ల లేరు.. నువ్వే మా ఆడపిల్లవి అంటూ హారికపై ప్రత్యేక శ్రద్దను కనబర్చింది. పైగా మోనాల్‌తో ఓ రెండు మూడు మాటలే మాట్లాడి వదిలేసింది. మోనాల్ జస్ట్ ఫ్రెండ్ అని, చెప్పు చెప్పు తెలుగు నేర్చుకున్నావా? అని అడిగింది అంతే. కానీ హారికపై మాత్రం ఇంకాస్త ఎక్కువగా దృష్టి పెట్టింది. బయట ఇంటర్వ్యూలు ఇచ్చిన సమయంలోనూ మోనాల్ గురించి ఎక్కువగా మాట్లాడటానికి వారు ఇష్టపడలేదు.