పవన్ కళ్యాణ్ సినిమాలకి అదే పెద్ద అడ్డంకి.!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగబోతోంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. ఏమో, రెండూ ఒకేసారి వుండొచ్చు కూడా.! సరే, ఎన్నికలకీ.. సినిమా సంబంధిత చర్చలకీ సంబంధమేంటి.? అంటే, ఎందుకు లేదు.?

పవన్ కళ్యాణ్ కేవలం సినీ నటుడు కాదు, రాజకీయ ప్రముఖుడు కూడా. తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. ఎన్నికల కోడ్ అంటూ అమల్లోకి వస్తే, పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల విడుదలకు ఆస్కారమే వుండదన్నది తాజాగా జరుగుతున్న ప్రచారం.

ఈ విషయమై నిర్మాతల్లో టెన్షన్ బయల్దేరింది. కానీ, మధ్యలో కొంత గ్యాప్ వుంటుంది. ఆ గ్యాప్‌లో పవన్ కళ్యాణ్ సినిమాల్లో దేన్నో ఒకదాన్ని రిలీజ్ చేసుకోవచ్చు. ఏది రిలీజ్ అవుతుంది.? అన్నదానిపై ఎవరికీ స్పష్టత లేదు.

‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలు శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్నాయట. ‘హరిహర వీరమల్లు’ అయితే దాదాపు ఆగిపోయినట్టే. సగం సినిమాని ‘పార్ట్ వన్’ అని విడుదల చేయాలనే ఆలోచనతో నిర్మాత వున్నా, అందుకు తగ్గ రీతిలో పనులు జరగడంలేదు.

సో, ఎలా చూసినా ఎన్నికల తలనొప్పి.. ఇతరత్రా సమస్యలు, పవన్ కళ్యాణ్ సినిమాలకి ప్రధాన అడ్డంకి అన్నమాట.