బేబీకి డిమాండ్ పెరిగిందిగా..

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కాంబినేషన్ లో ముక్కోణపు ప్రేమకథ చిత్రంగా తెరకెక్కిన మూవీ బేబీ. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని ఎస్ కె ఎన్ నిర్మించారు. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ మధ్యకాలంలో వచ్చిన చిన్న సినిమాలలో ప్రేక్షకుల మనస్సులకి దగ్గరైన మూవీగా ప్రశంసలు అందుకుంటుంది.

అప్పట్లో కార్తికేయ హీరోగా వచ్చిన ఆర్ ఎక్స్ 100 తరహాలో ఫెయిల్యూర్ స్టొరీగా యూత్ ప్రేక్షకులకి ఈ మూవీ భాగా చేరువ అయ్యింది. అయితే ఆ మూవీని బోల్డ్ కంటెంట్ తో ప్రెజెంట్ చేస్తే బేబీ సినిమాని ఒక అమ్మాయి దృక్కోణం నుంచి ఆవిష్కరించారు. ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించడంలో కాని, అతనితో ప్రయాణంలో గాని వారి ఉద్దేశ్యాలు ఎలా ఉంటాయి అనేది బేబీ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశారు.

ఈ మూవీ చూస్తున్నంత సేపు ప్రతి ఒక్కరు వారి జీవితంలో జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయి ఎక్కడో ఒక చోట స్టక్ అయిపోతారు. అందుకే బేబీ మూవీ మౌత్ టాక్ తో ప్రేక్షకులకి చేరువ అవుతోంది. శని, ఆదివారాలలో కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొదటి రోజు ప్రీమియర్స్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.

ఇదిలా ఉంటే బేబీ సినిమా రిలీజ్ కి ముందే నిర్మాత ఎస్ కె ఎన్ పెట్టిన పెట్టుబడిలో 75 శాతం వెనక్కి తెచ్చుకున్నారు. మూవీ నాన్ థీయాట్రికల్ రైట్స్ ఏకంగా 7.5 కోట్లకి అమ్ముడయ్యాయి. పది కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారంట. మూవీ మెజారిటీ షేర్ వచ్చేయడంతో నైజాం ఉత్తరాంద్రలో సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. మిగిలిన ప్రాంతాలలో డీసెంట్ రేట్స్ కి రైట్స్ అమ్మేసారు.

ఎలాగూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది కాబట్టి మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఎవెన్ ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెయిన్ లీడ్ చేసిన వైష్ణవి చైతన్యకి కచ్చితంగా ఈ మూవీ హీరోయిన్ గా బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నారు.