ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) అనేది మనుషుల మానసిక సామర్థ్యాలను పూర్తిగా అనుకరించే కృత్రిమ మేధస్సు స్థాయి. అంటే, ఏ ఒక్క పని కాదు… విభిన్న రంగాల్లో కూడా సమస్యల పరిష్కారం, అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం, తీర్మానం తీసుకోవడం వంటి సామర్థ్యాలు మనుషుల్లా కలిగి ఉండే సిస్టమ్. ఇప్పటికీ మనం చూసే చాట్‌బాట్‌లు, భాషా మోడల్స్, వాయిస్ అసిస్టెంట్లు అన్నీ Narrow AIకు చెందినవే. ఇవి ఒక్కొక్క పనిలో మాత్రమే నిపుణత చూపగలవు. కానీ AGI మాత్రం వివిధ పరిస్థితుల్లో అటు మనిషిలా ఆలోచించి, తగిన నిర్ణయాలు తీసుకునే స్థాయికి వెళ్తుంది.
కలల్ని ఆకృతిరూపంలోకి తేవడమే విజ్ఞానం లక్ష్యం. కానీ టెక్నాలజీ ఇప్పుడు ఆ కలలకే కొత్త పరిమాణాల్ని ఇస్తోంది. అతి త్వరలోనే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) సాధ్యమేనని గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ డెమిస్ హసాబిస్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆగ్నేయాసియా నుంచి అమెరికా వరకూ మారుతున్న టెక్నాలజీ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుంటే, వచ్చే పదేళ్లలోనే AGIను అందుకోవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. గూగుల్ జెమినీ, ఇతర ఏఐ టూల్స్‌పై నాయకత్వం వహిస్తున్న హసాబిస్, విద్యార్థులకు AIపై లోతైన అవగాహన అవసరమని హెచ్చరిస్తున్నారు.
తాజాగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో హసాబిస్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత కలిగినవిగా మారాయి. “మీరు ప్రవేశించబోయే ప్రపంచం ఊహించనంత వేగంగా మారుతుంది” అని హసాబిస్ అన్నారు. మార్పుల గుండెను తాకేలా నేర్చుకోవడం, పరిణామాల కోసం సిద్ధంగా ఉండటం ఇప్పుడు విద్యార్థులకు అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ‘లెర్నింగ్ టు లెర్న్’ అనేది కీలకమైన నైపుణ్యంగా హసాబిస్ అభివర్ణించారు.
AI, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, క్వాంటం కంప్యూటింగ్ వంటి రంగాలు ఈ దశాబ్దంలో అభివృద్ధి చెందే కీలకమైన ప్రాంతాలుగా ఎదుగుతాయని ఆయన భావిస్తున్నారు. ఈ మార్పులతో కొన్ని ఉద్యోగాలు తొలగినా, వాటి స్థానంలో మరింత విలువైన, సృజనాత్మకతను ప్రోత్సహించే ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. “ఏ మార్పైనా అవకాశాల ద్వారాల్ని తెరుస్తుంది” అని హసాబిస్ స్పష్టంగా చెప్పారు.