అందరి చూపులు ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ పైనే వున్నాయి. ఆమె నటించిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈమధ్యకాలంలో అనుపమకు పెద్ద బ్రేక్ అయితే ఏమీ రాలేదు, అలాగే పెద్ద సినిమాల ఆఫర్స్ కూడా లేవు. అనుపమ మంచి ప్రతిభ గల నటి, తెలుగులో తన గొంతుకు తనే డబ్బింగ్ చెప్పుకునే నటీమణుల్లో అనుపమ ముందుంటారు. ఈ ‘టిల్లు స్క్వేర్’ లో సిద్ధు జొన్నలగడ్డ పక్కన కథానాయికగా నటించింది.
ఇంతకు ముందు సిద్ధు నటించిన ‘డీజే టిల్లు’ పెద్ద విజయం సాధించటం, ఆ సినిమాకి ఇది సీక్వెల్ గా రావటం, ఈ సినిమాకి లాభదాయకం అని అంటున్నారు. ఇక ఇంతవరకు అన్ని సినిమాలలో అనుపమ తన నటనతో ఎక్కువమంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. సామజిక మాధ్యమాల్లో కూడా ఆమెకి విశేషమైన పేరు వుంది, అందుకే ఆమెకి చాలా ఎక్కువమంది ఫాలోవర్స్ కూడా వున్నారు.
ఇన్‌స్టాగ్రామ్ లో ఆమెకి 16 మిలియన్ ఫాలోవర్స్ వున్నారంటే మాటలు కాదు. అనుపమ గ్లామరస్ నటి కూడా, కానీ ఆమె ఎప్పుడూ పరిధి దాటకుండా ఇంతవరకు అన్ని సినిమాలలో కనిపించింది. మరి ఏమైందో ఏమో కానీ, ‘టిల్లు స్క్వేర్’ లో ఈ గ్లామర్ డోసు అనుపమ కావాలనే ఎక్కువ చేశారు అని అటు సామాజిక మాధ్యమాల్లో, ఇటు పరిశ్రమలో టాక్ నడుస్తోంది.
విడుదలైన ఈ సినిమా ప్రచార వీడియోల్లో చూస్తే అందులో అనుపమ ఇంతకు ముందు చేసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో గ్లామర్ డోసు బాగా పెంచినట్టు కనపడుతోంది. అయితే ఆమె అభిమానులు చాలామంది ఆమెని అలా చూసి బాగా హర్ట్ అయ్యారు అని ఆమె సామాజిక మాధ్యమాల్లో వాళ్ళు పెట్టిన కామెంట్స్ చూస్తేనే అర్థం అయిపోతోంది. ఆమె ఎందుకు ఈ సినిమా చేసినట్టు, కేవలం తనకి పెద్ద ప్రాజెక్టులు రావటం లేదని ఈ సినిమా ఒప్పుకున్నారు అనే టాక్ కూడా ఒకటి పరిశ్రమలో నడుస్తోంది.
కొన్ని రోజుల క్రితం ‘టిల్లు స్క్వేర్’ ప్రచారానికి అనుపమ వచ్చినప్పుడు ఆమెకి విశేష స్పందన వచ్చింది. అలాగే ఎక్కువమంది ఆమె ఈ ప్రచార చిత్రాలలో కన్పించిన ఆ ముద్దు సన్నివేశం, గ్లామర్ డోసు పెంచారా లాంటి వీటిపై ప్రశ్నలు అడిగారు. అదే సమావేశంలో ఆమె ‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రచారాలు ఇక మిస్ అవును, అన్నిటికీ వస్తాను అని చెప్పారు. కానీ ఆసక్తికరం ఏంటంటే నిన్న జరిగిన ఆ సినిమా ప్రీ విడుదల వేడుకకి ఆమె డుమ్మా కొట్టారు. మిస్ అయ్యారు.