Telusu Kada Movie Review: ‘తెలుసుకదా’ మూవీ రివ్యూ

‘డీజే టిల్లూ’, ‘డీజే టిల్లూ స్క్వేర్’ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో యూత్ లోవిపరీతమైన క్రేజ్ ని సృష్టించుకున్న సిద్ధూ జొన్నలగడ్డ, తర్వాత స్పై యాక్షన్ జానర్ లో ‘జాక్’ లో నటించి పరాజయం పొందాడు. దీంతో తనది యాక్షన్ జానర్ కాదని తెలుసుకున్నట్టున్నాడు- సేఫ్ గా అనిపించే రోమాంటిక్ జానర్ కి తిరిగి వచ్చేశాడు. అయితే ఈ సారి టిల్లూ మార్క్ కల్ట్ క్యారక్టరైజేషన్ కి కూడా గుడ్ బై చెబుతూ మంచి నిర్ణయం తీసుకున్నాడు- ఇప్పుడు తాజా ప్రయత్నం ‘తెలుసుకదా’ లో దాని ఛాయలు పడకుండా జాగ్రత్త వహించాడు. ప్రముఖ స్టయిలిస్ట్ నీరజా కోన దర్శకురాలుగా మారుతూ రూపొందించిన ‘తెలుసుకదా’ ట్రైలర్స్ తో ఆసక్తి రేపింది- ఇదొక బోల్డ్ మూవీగా వుండబోతోందని సంకేతాలిచ్చింది. సమకాలీన రోమాంటిక్ డ్రామాగా ఒక వర్గం ప్రేక్షకులకి నచ్చే తీరు తెన్నులతో సిద్దూతో చేసిన ఈ ప్రయత్నం ఒక రకంగా ప్రయోగమే. ఈ ప్రయోగం ఎంత వరకు ఫలించింది? సిద్ధూకి ఇది హిట్టేనా? ఇటీవల ‘మిరాయ్’ వంటి సూపర్ హిట్ ని అందించిన నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరో హిట్ ని అందించినట్టేనా? ఈ ప్రశ్నలకి జవాబులు తెలుసుకుందాం…

కథేమిటి?

వరుణ్ (సిద్దూ జొన్నలగడ్డ), షెఫ్ గా రెస్టారెంట్ నడుపుతూ ఉంటాడు. అతడి ఫ్రెండ్ రాగ (శ్రీనిధి శెట్టి) ని పెళ్లి చేసుకుని పిల్లలతో సంతోషర కరమైన ఫ్యామిలీ లైఫ్ గడపాలని కోరుకుంటాడు. అయితే తమ రిలేషన్ షిప్ కి పెళ్లి అనే గమ్యం ఆశించడం లేదని ఆమె బ్రేకప్ చెప్పడంతో హర్ట్ అయి- ఆమెని మర్చిపోయి అంజలి (రాశి ఖన్నా)ని వివాహం చేసుకుంటాడు. చేసుకుని హాయిగా గడుపుతున్నాక తమకి పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలుసుకుని షాక్ అవుతాడు. ఇప్పుడు వరుణ్ జీవితంలోకి రాగ ఎలా తిరిగి వస్తుంది? అంజలి, రాగ పూర్వం ఫ్రెండ్స్స్ ఎలా అయ్యారు? పిల్లల్ని కనాలనే కోరికని తీర్చుకోవడానికి అంజలి ఏ నిర్ణయం తీసుకుంది? ఆమె నిర్ణయం ముగ్గురినీ ఎలా ప్రభావితం చేసింది? అనేది మిగిలిన కథ.

ఎలావుంది కథ?

బోల్డ్ గా తీసిన జెన్ జీ తరం రిలేషన్ షిప్ కథ ఇది. రిలేషన్ షిప్స్ కి జెన్ జీ ఇచ్చే నిర్వచనం, ఆ నిర్వచనంతో కన్ఫ్యూజన్, ఈ కన్ఫ్యూజన్ లోంచి బయటపడడానికి బ్రేకప్స్ చెప్పేయడం- ఇంత సింపుల్ గా మూవ్ ఆన్ అయిపోతామనుకోవడం, కానీ ప్రశ్నించే అంతరాత్మకి సమాధానం చెప్పుకోలేక సతమతమవడం…ఇవన్నీ అపరిపక్వతకి నిదర్శనాలుగా కనిపించి, చివరికి నిర్వచనాలు మార్చుకోక తప్పదని తెలుసుకోవడం… ఇదీ జరుగుతున్న తతంగం.

దర్శకురాలు నీరజా కోన ఈ సమస్యని కథాంశంగా తీసుకుని, విభిన్న లక్షణాలతో కూడిన మూడు పాత్రలతో మిళితం చేసి, జెన్ జీ తరం ఆలోచనా విధానాన్ని ఒక రోమాంటిక్ డ్రామాగా రూపొందించారు. మొత్తం కలిపి తొమ్మిది పాత్రలున్న కథలో నాలుగు పాత్రలు కీలకమైనవి. సిద్ధూ జొన్నల గడ్డ, రాశీఖన్నా, శ్రీనిదీ శెట్టి, వైవా హర్ష. సిద్ధూ ఈసారి మొత్తం యువప్రేక్షకుల్ని గాకుండా, అర్బన్ యూత్ కి నచ్చే కథతో ఈ ప్రయోగం చేశాడు. కనుక పాత్రలు, మనస్తత్వాలు, ప్రవర్తనలు,డైలాగులు, నిర్ణయాలు సామాన్య ప్రేక్షకులకి దూరంగా అనిపిస్తాయి.

అయితే కొత్తగా చెప్పాలనుకున్న కాన్సెప్ట్ బావుంది కానీ కథ పెద్దగా లేదు. ఉన్న కథ చెప్పిన తీరులో డెప్త్ లేక పైపైన నడిపేయడంతో, కనెక్ట్ అవడం కూడా కష్టంగా మారింది. ముఖ్యంగా పిల్లల్ని కనే విషయంలో అంజలి నిర్ణయం తీసుకునే కాన్ఫ్లిక్ట్ లో బలం, లాజిక్ లేక కథ తేలిపోయింది. కొన్ని సార్లు సీన్లు రిపీటవుతూంటాయి. ఇది సెకండాఫ్ కి బాగా మైనస్ అయింది. కాన్ఫ్లిక్ట్ తోనైనా ఎమోషన్స్ పుట్టక పోవడంతో మొత్తంగా చూస్తే సినిమా ఫ్లాట్ గా అనిపిస్తుంది. ఇది స్థూలంగా ముక్కోణ ప్రేమ కథే అయినా, కాన్ఫ్లిక్ట్ పాయింటు బలంగా లేకపోవడంతో ఆశించిన జెన్ జీ జీవితాల కథకి దూరంగా ఉండిపోయింది. చివరికి పెద్దవయసు పాత్ర అన్నపూర్ణమ్మకొలిక్కి తేవడం ఒక్కటే ఊరట!

ఎవరెలా చేశారు?

సినిమాలో ఉన్న తొమ్మిది పాత్రల్లో నాలుగు మాత్రమే ముప్పావు వంతు సినిమాని అక్రమించేశాయి. సిద్ధూ జొన్నల గడ్డ, రాశీఖన్నా, శ్రీనిదీ శెట్టి, వైవా హర్ష. వరుణ్ పాత్రలో సిద్దూ జొన్నలగడ్డ డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగు మొదలైనవి టిల్లూ షేడ్స్ పడకుండా పాత్ర పరంగా సహజంగా ప్రదర్శించాడు. ఎమోషన్లు పెద్దగా లేకపోవడం, కథ ఫ్లాట్ గా నడవడం తనకి సహకరించక పోయినా పాత్రకి జీవం పోసేందుకు కృషి చేశాడు. కీలకమైన అంజలి పాత్రలో రాశి ఖన్నాకి కూడా డెప్త్ లేని సమస్య. కానీ సిద్దూతో ఆమె కెమిస్ట్రీ సినిమా అంతటా బాగానే వర్కవుట్ అయింది. వాళ్ళ మధ్య ఫస్ట్ సీనులో కెమిస్ట్రీ క్లాస్ గా వుంది. కానీ పిల్లల కోసం తపించే పాత్రగా మాత్రం రాశీ నటించడానికి తగిన విషయమ లేదు. రాగ పాత్రలో శ్రీనిధి శెట్టికి

మంచి పాత్రే లభించింది. మంచి నటన కూడా ప్రదర్శించింది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లలో ఆమె టాలెంట్ బయట పడుతుంది. ఇక సిద్ధూ బెస్ట్ ఫ్రెండ్ గా వైవా హర్షకి పూర్తి నిడివి పాత్ర దక్కింది. దీన్ని బాగా ఉపయోగించుకుని సినిమా అంతటా నవ్వులు కురిపించాడు. అన్నపూర్ణమ్మ అమ్మమ్మ పాత్రలో, క్లయిమాక్స్ లో తన నటనానుభవాన్నంతా బలంగా ప్రదర్శించింది.

కెమెరా వర్క్, మ్యూజిక్ సినిమా క్వాలిటీని పెంచాయి. గుణ శేఖర్ కెమేరా వర్క్ ముఖ్యంగా ఫాష్ బ్యాక్ లో, పాటల చిత్రీకరణాల్లో పరవళ్ళు తొక్కింది. తమన్ కూడా రెండు సెన్సిటివ్ సాంగ్స్ అందించి రోమాన్స్ కి న్యాయం చేశారు. ఎడిటింగ్, ఆర్ట్, ఇతర ప్రొడక్షన్ విలువలు అన్నీ ఉన్నత ప్రమాణాలతో వున్నాయి.

చివరికేమిటి?

రచయిత్రిగా, దర్శకురాలిగా తొలి ప్రయత్నంతో ఒక ముద్ర వేయాలని ప్రయత్నించిన నీరజా కోన అభిలాష కొనియాడ దగిందే. అయితే దర్శకత్వం విషయంలో, డైలాగుల విషయంలో సక్సెస్ సాధించింది. కథ విషయంలోకూడా శ్రద్ధ తీసుకుని వుంటే ప్రయోగాత్మకంగా ఒక వర్గం – జెన్ జీ ప్రేక్షకుల కోసం చేసిన ప్రయత్నం మరింత ఆకట్టుకునేది. సిద్ధూ జొన్నలగడ్డ క్యారక్టర్ పరంగా తీసుకున్న నిర్ణయం తను ఇలాటి పాత్రలకే సరిపోతాడని సంకేతాలివ్వకుండా వుంటే మంచిది. ఇక ఈ బోల్డ్ మూవీ మిగతా వర్గాల ప్రేక్షకులకి ఏ మాత్రం నచ్చుతుందనేది ఈ వారాంతం కల్లా తెలిసిపోతుంది.

రేటింగ్ : 2. 25 /5

Karmuri Venkat Reddy About Sollar System Tender Controversy | Chandrababu | Darling Minister