అన్నమయ్య నిర్మాత వీ దొరస్వామి రాజు కన్నుమూత !

తెలుగు సినిమా పరిశ్రమ‌ సీనియర్‌ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ వి.ఎం.సి అధినేత వి.దొరస్వామిరాజు సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల నుంచి వయో భారంతో దొరస్వామిరాజు ఆరోగ్యం క్షీణించింది. అనారోగ్యంతో ఆయన బంజారా హిల్స్‌ కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వృద్ధాన్యం కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించగా, కొంతకాలంగా బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో కుటుంబీకులు చికిత్స నిమిత్తం చేర్చారు. అయితే, పరిస్థితి విషమించి, ఆయన తుది శ్వాస విడిచారని వైద్య వర్గాలు వెల్లడించాయి.

Veteran producer V Doraswamy Raju is no more

కాగా, వీఎంసీ పేరిట డిస్ట్రిబ్యూషన్ సంస్థను ప్రారంభించిన ఆయన, అదే బ్యానర్ పై ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఎన్టీఆర్ నటించిన వేటగాడు, యుగంధర్, డ్రైవర్ రాముడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి చిత్రాలతో పాటు ఏఎన్నార్ నటించిన ప్రేమాభిషేకం చిత్రాలను ఆయన వీఎంసీ ద్వారా విడుదల చేశారు. సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, కిరాయిదాదా, అన్నమయ్య, సింహాద్రి, వెంగమాంబ, భలే పెళ్లాం వంటి సినిమాలను ఆయన నిర్మించారు.

1994లో నగరి నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీటీడీ బోర్డు మెంబర్‌గా, ఫిలిం ఛాంబర్‌ ప్రెసిడెంట్‌, డిస్ట్రిబ్యూషన్‌ అండ్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌, ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఇలా ఎన్నో పదవులను అలంకరించారు. కొంతకాలంగా నిర్మాణ రంగానికి దూరంగా ఉన్న దొరస్వామిరాజు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటుగా చెప్పవచ్చు.