అందగన్‌ పేరుతో అంధధూన్‌ రీ మేక్‌

ఆరేండ్ల క్రితం బాలీవుడ్‌లో వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం ’అంధధూన్‌’ దానిని ఇప్పటికే తెలుగు, మలయాళ, కన్నడ సినిమాల్లో రిమేక్‌ చేసి విడుదల కూడా చేశారు. అయితే అదే సమయంలో తమిళంలోనూ ప్రశాంత్‌ హీరోగా ’అందగన్‌’ పేరుతో మొదలు పెట్టారు. ప్రశాంత్‌ తండ్రి ప్రముఖ డైరెక్టర్‌ త్యాగరాజన్‌ తన సొంత నిర్మాణ సంస్థ స్టార్‌ మూవీస్‌ పతాకంపై నిర్మిస్తూ, దర్శకత్వం వహించారు. అయితే చాలాకాలం తర్వాత ఈ సినిమా నుంచి అప్డేట్‌ వచ్చింది.

తాజాగా ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే, విడుదల తేదీపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ ’అందగన్‌’ చిత్రంలో హిందీలో ఆయుష్మాన్‌ ఖురానా పోషించిన పాత్రను ప్రశాంత్‌ చేస్తుండగా రాధికా ఆప్టే పాత్రలో ప్రియా ఆనంద్‌ టబు పాత్రను సిమ్రాన్‌ చేస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో కార్తీక్‌, యోగిబాబు, ఊర్వశి, కేఎస్‌ రవికుమార్‌, మనోబాలా, వనిత విజయకుమాన్‌, సెమ్మలర్‌, పూవైయార్‌ తదితరులు నటించారు.

రవియాదవ్‌ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సమకూర్చారు. ఇదిలాఉండగా ఈ సినిమా షూటింగ్‌ 2021 జూన్‌లోనే పూర్తయింది. కానీ, పలు కారణాలతో ఈ సినిమా విడుదలలో తీవ్ర జాప్యం నెలకొంది. సంక్రాంతికి ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కాగా, అగ్ర హీరో విజయ్‌ నటించిన ’ది గోట్‌’ చిత్రంలో ప్రశాంత్‌ ఓ ముఖ్య పాత్రను పోషించగా ఈ చిత్రం సెప్టెంబరులో విడుదల కానుంది.