అమర్‌సింగ్‌ చంకీలకు మంచి స్పందన!

ప్రముఖ పంజాబీ గాయకుడు అమర్‌ సింగ్‌ చంకీల 27 ఏళ్ల వయసులోనే హత్యకు గురైన సంగతి తెలిసిందే! ఆయన జీవితం ఆధారంగా ‘అమర్‌సింగ్‌ చంకీల’చిత్రాన్ని తెరకెక్కించారు. ఇంతియాజ్‌ అలీ దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌ నటుడు దిల్జిత్‌ దొసాంజ్‌, పరిణీతి చోప్రాప్రధాన పాత్రధారులు. ఏప్రిల్‌ 12న నెట్‌ప్లిక్స్‌ వేదికగా విడుదలైన ఈ చిత్రం విశేష ఆదరణ పొందుతోంది. ఈ చిత్రంలో ఆమె పోషించిన అమర్‌జోత్‌ కౌర్‌ పాత్రకు వస్తున్న స్పందన గురించి పరిణీతి స్పందించారు.

‘అమర్‌ సింగ్‌ చంకీల’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది. ఆనందంతో కన్నీళ్లు ఆగడం లేదు. పరిణీతి ఈజ్‌ బ్యాక్‌.. అనే మాటలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంత స్పందన నేను ఊహించలేదు. అవును.. నేను తిరిగొచ్చేశా. ఎక్కడికీ వెళ్లను.

సినీ ప్రేమికులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు మనసు నిండిపోయింది‘ ప్రియాంక చోప్రా సోదరిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన నటి పరిణీతి చోప్రా 2011లో విడుదలైన ‘లేడీస్‌ వర్సెస్‌ రికీ బప్ల్‌’లో కీలక పాత్ర పోషించారు.’శుధ్ద్‌ దేశీ రొమాన్స్‌’ , ‘ఇషక్‌ జాదే’, ‘దావత్‌ ఏ ఇష్క్‌’, ‘కిల్‌ దిల్‌’, ‘డిష్యూం’, ’గోల్‌మాల్‌ అగైన్‌’, ‘కేసరి’, ‘సైనా’ వంటి చిత్రాల్లో ఆమె కథానాయికగా నటించి అలరించారు. ఆప్‌ యువ నాయకుడు రాఘవ్‌ చద్థాను గతేడాది ఆమె వివాహం చేసుకొన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్తి చెబుతారని అంతా భావించారు. కానీ తాజా పోస్ట్‌తో ఆ ఊహాగానాలకు చెక్‌ పెట్టారు.