Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో భాగంగా అల్లు అర్జున్ అభిమాని రేవతి అనే మహిళ మరణించారు అయితే అల్లు అర్జున్ వచ్చిన సమయంలోనే ఈ తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో అల్లు అర్జున్ ను పోలీసులు తాజాగా అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
ఇక ఈ ఘటనపై గతంలోనే అల్లు అర్జున్ స్పందిస్తూ బాధిత మహిళ కుటుంబానికి అండగా ఉంటానని తెలియజేశారు. ఇక ఈయనపై కేసు నమోదు కావడంతో పోలీసులు టాస్క్ ఫోర్స్ సిబ్బంది సహాయంతో ఈయనని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇలా పోలీసులు ఈయనని అరెస్టు చేయడంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.
ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ భద్రతను నిర్వహించారు సుమారు 300 మంది పోలీసులు పోలీస్ స్టేషన్ వద్ద భద్రత చర్యలను చేపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పోలీస్ స్టేషన్ వద్ద 20 మంది పోలీసులు ఉండగా పరిసర ప్రాంతాలలో మిగిలిన పోలీసులు భద్రత చర్యలను చేపట్టారు. స్థానిక పోలీసులతో పాటు.. ప్రత్యేక భద్రతా బలగాలు సైతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో భద్రతను పర్యవేక్షిస్తున్నాయి.
అల్లు అర్జున్ అరెస్టు అయ్యారనే విషయం తెలియగానే భారీ ఎత్తున ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ పరిసర ప్రాంతంలో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను కూడా పర్యవేక్షిస్తూ ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.