Allu Arjun: పుష్ప 2 బాక్సాఫీస్: బన్నీ అరెస్ట్ రోజు ఎంత వచ్చాయంటే?

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 విడుదలై వారం గడుస్తున్నా, బాక్సాఫీస్ వద్ద దూసుకుతూ రికార్డుల మోత మోగిస్తోంది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం కలకలంగా మారింది. ఈ పరిణామం ఆయన అభిమానులను కలవరపెట్టినా, పుష్ప 2 కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది.

సినిమా విడుదలైన 9వ రోజైన శుక్రవారం, పుష్ప 2 దేశవ్యాప్తంగా రూ.36.25 కోట్లు వసూలు చేసింది. హిందీ వెర్షన్‌లో ఈ చిత్రం రూ.27 కోట్లు అందుకోవడం విశేషం. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, వీకెండ్‌లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. తెలుగు వెర్షన్ రూ.7.5 కోట్లు, తమిళంలో రూ.1.35 కోట్లు, కన్నడ, మలయాళంలో రూ.0.2 కోట్లు వసూలు చేయడం పుష్ప 2 స్థాయిని చాటిచెప్పుతోంది.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పుష్ప 2 మొత్తం రూ.762 కోట్లను రాబట్టగా, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1067 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. అత్యంత వేగంగా రూ.1000 కోట్ల క్లబ్ చేరిన ఇండియన్ సినిమాగా నిలిచిన పుష్ప 2, రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ కలెక్షన్లను అధిగమించేందుకు సిద్ధంగా ఉంది. సుకుమార్ దర్శకత్వం, అల్లు అర్జున్ నటన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాను ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక గొప్ప అధ్యాయంగా నిలిపాయి. జైలు లోపల ఉన్నప్పటికీ, అల్లు అర్జున్ క్రేజ్ తగ్గకపోవడం, అభిమానులు ఆయనపై చూపిన ప్రేమ సినిమా విజయానికి కీలకంగా మారింది. ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 మరో కొత్త రికార్డ్ ను అందుకుంటుందని ట్రేడ్ పండితులు ఆశిస్తున్నారు.