టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొందిన అలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని వందలకు పైగా సినిమాలలో కమెడియన్ గా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆలీ ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇలా నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారి సినిమాలను నిర్మించడమే.. కాకుండా బుల్లితెర మీద ప్రసారం అవుతున్న టీవీ షోలో కూడా సందడి చేస్తున్నాడు. ఇటీవల అలీ నిర్మాతగా వ్యవహరించిన “అందరూ బాగుండాలి అందులో నేనుండాలి” అనే సినిమా ఓటీటీలో విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఇదిలా ఉండగా అలీ ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరొకవైపు రాజకీయ వ్యవహారాలలో కూడా చురుగ్గా పాల్గొంటూ ఉంటాడు. ఆంధ్రప్రదేశ్లో 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేసిన అలీ తన కష్టానికి ఫలితంగా ఇటీవల జగన్ ప్రభుత్వంలో ఒక కీలక పదవి సొంతం చేసుకున్నాడు. ఎలక్షన్ల సమయంలో పార్టీ గెలవడానికి అలీ చేసిన కృషికి ఫలితంగా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ఆలీని నియమించాడు. ఈ క్రమంలో అలీ ఆనందం వ్యక్తం చేస్తూ … ఈ పదవి నా కూతురు పెళ్లికి జగన్ ఇచ్చిన గిఫ్ట్ అంటూ వెల్లడించాడు.
ఇటీవల అలీ పెద్ద కుమార్తెకు నిశ్చితార్థం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. తొందర్లోనే అలీ తన పెద్ద కూతురి వివాహం ఘనంగా చేయబోతున్నాడు. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా తన కూతురు వివాహానికి ఆహ్వానించాడు. అలీ తన భార్యతో కలిసి జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి తన కూతురు పెళ్లికి తప్పకుండా రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. జగన్ కూడా కూతురు పెళ్లికి తప్పకుండా వస్తానని చెప్పినట్లు సమాచారం. ఇక ఈ సందర్భంగా తనని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించినందుకు జగన్ గారికి అలీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసినట్లు సమాచారం.