భారత్ లో భారీ ఉగ్రదాడికి కుట్ర.. నలుగురు ముష్కరులు అరెస్ట్..!

భారత్‌లో భారీ ఉగ్ర కుట్రను భద్రతా దళాలు సమయస్ఫూర్తిగా భగ్నం చేశాయి. అంతర్జాతీయ ఉగ్ర సంస్థ అల్ ఖైదా భారత్‌లో మరోసారి అల్లకల్లోలం సృష్టించేందుకు సిద్ధమవుతుండగా, పోలీసులు, ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ముందుగానే సమాచారం అందుకుని కీలక ఆపరేషన్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా కుట్రకు పాల్పడుతున్న నలుగురు అల్ ఖైదా ఉగ్రవాదులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ నలుగురిలో ఇద్దరిని గుజరాత్‌లో, మరొకరిని ఢిల్లీలో, ఒకరిని నోయిడాలో పోలీసులు పట్టుకున్నారు. వీరంతా భారత్‌లో కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఉగ్ర దాడులకు ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది. గతంలో పహల్గామ్ దాడి తర్వాత భారత్‌ ఉగ్రవాద శిబిరాలపై కఠినంగా యాక్షన్‌ తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో భారత సైన్యం అల్ ఖైదా ఆధ్వర్యంలోని పలు శిబిరాలను ధ్వంసం చేయగా, అనేక మంది కీలక ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆ ఘటనల తర్వాత ఇండియాకు అల్ ఖైదా ప్రతీకారం తీర్చుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఇంటెలిజెన్స్, రాష్ట్ర పోలీసు విభాగాలు ఎప్పటికప్పుడు నిఘా ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే అల్ ఖైదా నేతృత్వంలోని కొందరు రహస్యంగా భారత్‌లో అలజడి సృష్టించేందుకు.. ప్రణాళిక వేసుకుంటున్నట్టు సమాచారం రావడంతో అధికారులు ఎక్కడ తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా వారిని పట్టుకోవడంలో విజయవంతమయ్యారు.