టాలివుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా గుర్తింపు పొందిన అలనాటి నటుడు కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక గొప్ప నటుడిగా గుర్తింపు పొందడమే కాకుండా కేంద్ర మాజీ మంత్రిగా కూడా సుపరిచితమైన కృష్ణం రాజు తాజాగా అనారోగ్యం వల్ల కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి తుదిశ్వాస విడిచారు.
అయితే కృష్ణం రాజు మృతికి గల కారణాల గురించి ఏఐజీ వైద్యుల వెల్లడించారు. దీర్ఘకాలికంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న కృష్ణంరాజు కొంతకాలం క్రితం రక్తప్రసరణ సరిగా జరగాక పోవటంతో ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో వైద్యులు కృష్ణంరాజు కాలికి సర్జరీ నిర్వహించారని వెల్లడించారు. తర్వాత ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి వెళ్లిన కృష్ణంరాజు ఆగస్ట్ 5వ తేదీన పోస్ట్ కోవిడ్ లక్షణాలతో మళ్లీ ఆసుపత్రిలో చేరినట్లు డాక్టర్లు వెల్లడించారు.
ఇలా ఆగస్ట్ ఐదవ తేదీన ఆసుపత్రిలో చేరిన కృష్ణంరాజుకు మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో న్యుమోనియా ఎక్కువగా ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో కృష్ణంరాజు కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో డాక్టర్లు అతనిని ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఉంటూ చికిత్స తీసుకుంటున్న కృష్ణంరాజు కు తాజాగా ఆదివారం తెల్లవారుజామున 3.16 గంటలకు గుండెపోటు రావడంతో కృష్ణంరాజు మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. కృష్ణంరాజు మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.