ఆదిపురుష్ సాంగ్ రెడీ.. ఇక సందడి మొదలు!

ఆదిపురుష్.. మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ బాలీవుడ్. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా కనిపించనున్నారు. రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. భారీ వీఎఫ్ఎక్స్ సాంకేతికతతో ఆదిపురుష్ సినిమా తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య ట్రైలర్ రిలీజ్ కాగా.. దీనికి విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చింది. వీఎఫ్ఎక్స్ చెత్తగా ఉన్నాయంటూ ప్రేక్షకులు తిట్టి పోయడంతో సినిమా రిలీజును చిత్రబృందం 6 నెలల పాటు వాయిదా వేసింది. ముందుగా జనవరి 12వ తేదీ అనుకోగా అది కాస్త పోస్ట్ పోన్ అయింది.

తాజాగా ఆదిపురుష్ చిత్రబృందం సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది. జూన్ 16వ తేదీన దేశవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ టీం ప్రకటించింది. పోస్టు ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయని, వీఎఫ్ఎక్స్ కు మెరుగులు అద్దినట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. దీంతో పాటు సినీ ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానుల కోసం మరో అప్డేట్ కూడా అందించింది ఆదిపురుష్ మూవీ టీం.

ఆదిపురుష్ నుండి ఓ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారట. దాంతో సినీ ప్రమోషన్స్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రచారం కూడా భారీ స్థాయిలో చేసేందుకు అంతా రెడీ చేసుకున్నట్లు సమాచారం. ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ ప్రమోషన్స్ లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే #150DaystoAdipurush అనే హ్యాష్ ట్యాగ్ తో సినిమాను ట్రెండ్ చేయడం ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. కానీ అనుకున్న రేంజ్ లో దీనికి రెస్పాన్స్ రాలేదు.

వీఎఫ్ఎక్స్ ను పూర్తిగా మార్చామని చెబుతున్న మూవీ టీం టీజర్ లేదా ట్రైలర్ విడుదల చేసి ఆదిపురుష్ చిత్రంపై బజ్ క్రియేట్ చేయాలని, ఇలా హ్యాష్ ట్యాగ్ లు క్రియేట్ చేస్తే ప్రయోజనం ఏమీ ఉండదని సినీ ప్రేక్షకులు, విశ్లేషకులు అంటున్నారు. ఇంకొంత లేటు అయినా పర్లేదు కానీ అద్భుతమైన వీఎఫ్ఎక్స్ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే సినిమాపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతుందని చెబుతున్నారు. మరి చిత్ర బృందం సినిమాకు సంబంధించిన కొత్త ట్రైలర్ ను విడుదల చేస్తారో లేదా చూడాలి.