డార్లింగ్ ప్రభాస్ సాహో, రాధేశ్యామ్ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‌లో ఇప్పటికే ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ప్రభాస్ మరో పాన్ ఇండియా చిత్రాలతో సందడి చేయడానికి ఎంతో హుషారుగా సమాయత్తమవుతున్నారు. అలాంటి సినిమాల్లో ‘ఆది పురుష్’ ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణాన్ని ‘ఆది పురుష్’ టైటిల్ తో రూపొందించారు. మన ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తే.. సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడిగా నటించారు. కృతి సనన్ జానకి దేవి పాత్రలో నటించారు.
‘ఆది పురుష్’ కోసం ఇండియన్ సినిమాల్లో ఇప్పటి వరకు ఉపయోగించని సరికొత్త మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.కాగా.. ‘ఆది పురుష్’ చిత్రాన్ని త్రీడీ వెర్షన్, ఐ మాక్స్ లో రూపొందించి విడుదలకు రెడీ చేస్తున్నారని ఇప్పటిదాకా వార్తలు షికారు చేశాయి. అయితే.. ఆ వెర్షన్ కాన్సిల్ అయినట్టు ఫిలిం మేకర్స్ గుసగుసలాడుకుంటున్నారు. ఇలా జరగడానికి కారణం లేకపోలేదు.. ఆ స్క్రీన్లన్నీ హాలీవుడ్ మూవీ ‘ఫ్లాష్’ కోసం ఎప్పుడో బ్లాక్ చేశారని తెలిసింది. . ఐమాక్స్ రూల్స్ ప్రకారం ఒకే సమయంలో రెండు సినిమాలు ఆ ఫార్మాట్ లో వేయడానికి వీలు పడదట. నిజానికి ‘ఆదిపురుష్’ కోసం ముందు అనుకున్న తేది 2023 సంక్రాంతి. దానికి అనుగుణంగానే అప్పటి పోస్టర్లలో ఐమాక్స్ లోగోతో పాటు ప్రమోషన్లు చేశారు.
కానీ ఊహించని విధంగా పోస్ట్ పోన్ కావడంతో ఐమాక్స్ స్క్రీన్లు దొరకకుండా పోయాయట! అయితే ఈ విషయంలో మన తెలుగుకి పెద్దగా వచ్చే నష్టం మాత్రం ఏం లేదట. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఐమాక్స్ స్క్రీన్ లేదు. తెలంగాణాలో ఒకే ఒకటి అదీ హైదరాబాద్ ప్రసాద్ లో ఉన్నది, సూళ్లూరుపేటలో యువి వాళ్ళు స్థాపించినవి పెద్ద తెరలే కానీ వాటికి ఐమ్యాక్స్ ప్రొజెక్షన్ ఉండదు. బెంగళూరు, ముంబై, చెన్నై, కోచి లాంటి నగరాల్లో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. అక్కడ ది ఫ్లాష్ స్క్రీనింగ్ ఉంటుంది. ఇదిలా ఉండగా …. ఇప్పటికే విడుదలైన ప్రభాస్ సినిమాలు సాహో, రాధే శ్యామ్ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయాలను సాధించలేకపోయాయి. మరి ఈసారైనా ‘ఆది పురుష్’, ‘సలార్’ చిత్రాలతో ప్రభాస్ భారీ విజయాన్నిఅందుకోవాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ ప్రభాస్ అండ్ ‘ఆది పురుష్’ టీమ్!!