హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నా: మోహన్‌ లాల్‌

జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక మలయాళ చిత్రపరిశ్రమను కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కేవలం ‘అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌’ ను లక్ష్యంగా చేసుకోవద్దని ’అమ్మ’ మాజీ అధ్యక్షుడు మోహన్‌ లాల్‌ విజ్ఞప్తి చేశారు. హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నామని. ఆ నివేదికను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సరైనదేనన్నారు.

అన్ని ప్రశ్నలకు ’అమ్మ’ సమాధానం ఇవ్వడం సాధ్యం కాదన్నారు. మలయాళ చిత్రపరిశ్రమ.. చాలా కష్టపడి పనిచేసే పరిశ్రమ అని, ఇందులో చాలామంది ఉన్నారని, అందరినీ నిందించలేమని తెలిపారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో దయచేసి పరిశ్రమను నాశనం చేయకండని విజ్ఞప్తి చేశారు. దోషులకు శిక్ష తప్పదని స్పష్టం చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఇటీవలే ‘అమ్మ’ అధ్యక్ష పదవికి మోహన్‌ లాల్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.