ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బ కి పరుగులు పెట్టిన ఆడియన్స్

టాలీవుడ్ లో స్టార్ హీరోలపై ఉన్న అభిమానం ఒక్కోసారి హద్దులు దాటేలా చేస్తుంది. వారు అభిమానించే హీరోల మాటలని కూడా లెక్క చేయకుండా అత్యుత్సాహంతో ఫ్యాన్స్ ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ శృతి మించి చేసే పనుల కారణంగా మిగిలిన వారు టార్చర్ అనుభవిస్తారు. భయభ్రాంతులకు గురవుతారు. అయిన కూడా తమ సంతోషం తమదే అన్నంతగా వారి ప్రవర్తలు ఉంటాయి.

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సింహాద్రి రీరిలీజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా స్క్రీన్స్ లో ఈ మూవీని రీరిలీజ్ షోలు ప్రదర్శించారు. అయితే ఈ రీరిలీజ్ సందర్భంగా తారక్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. చాలా చోట్ల బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అలాగే కొన్ని థియేటర్స్ వద్ద మేకపోతులని బలి ఇచ్చారు.

ఇలాంటి ఘటనలు స్టార్ హీరోలు అందరి సినిమాలకి జరిగేవే. అయితే తాజాగా లండన్ లోని హోన్స్ లో సినీ వరల్డ్ లో సింహాద్రి మూవీ ప్రదర్శన జరుగుతూ ఉండగా ఒక్కసారిగా దట్టమైన పొగ అల్లుకోవడంతో అలారం మోగడం జరిగింది. దీంతో ఆడియన్స్ అందరూ అగ్ని ప్రమాదం అనుకోని బయటకి పరుగులు తీసారు. అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని పరిశీలించారు.

అయితే థియేటర్ లో సినిమా ప్రదర్శన సందర్భంగా ఫ్యాన్స్ పొగ బాంబులు వేయడం వలన అదంతా జరిగిందని గుర్తించారు. ఫ్యాన్స్ అత్యుత్సాహంతో ఇలా పొగ బాంబులు వేయడంతో కొద్దిసేపు మాల్ లో గందరగోళం ఏర్పడింది. తీరా చూసాక కొందరు ఆకతాయి ఫ్యాన్స్ చేసిన పనిగా గుర్తించారు.

గతంలో జల్సా, దేశ ముదురు సినిమాల సమయంలో కూడా ఈ థియేటర్స్ లో ఆయా హీరోల అభిమానులు బీభత్సం సృష్టించారు. థియేటర్స్ లో బాణసంచా పేల్చడం, అద్దాలు ద్వంసం చేయడం చేశారు. దీంతో రీరిలీజ్ చేయకూడదని కొద్ది రోజులు అనుకున్నారు. మరల సింహాద్రి రీరిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు పొగబాంబులతో ఆడియన్స్ ని ఫ్యాన్స్ భయపెట్టారు.