దుమ్మురేపుతున్న ‘కల్కి’ వసూళ్లు… 800కోట్లకు చేరినట్లు చిత్రబృందం పోస్ట్‌!

ప్రభాస్‌ కీలక పాత్రలో నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2829 ఏడీ’ హవా కొనసాగుతోంది. యాక్షన్‌ సన్నివేశాలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌తో అత్యంత ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలిరోజే రూ.191.5 కోట్లు వసూలు చేసిన ‘కల్కి’ ఇప్పుడు రూ.800కోట్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం పోస్ట్‌ పెట్టింది. ప్రభాస్‌ పాత్రకు సంబంధించిన ఓ ఫొటోను షేర్‌ చేసింది.

ఈ మైథాలజీ సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌ రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడమే తరువాయి అంటూ ప్రభాస్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ’కల్కి 2829 ఏడీ’ విడుదలకు ముందే అమెరికాలో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా అక్కడ ఈ చిత్రం నిడివి తగ్గించినట్లు తెలుస్తోంది. దాదాపు 3 గంటలపైన నిడివి ఉన్న ‘కల్కి’.. ఇకపై 2.45 గంటలు ప్రదర్శితం కానుంది. చిత్ర నిర్మాణ సంస్థ పెట్టిన ఓ పోస్టర్‌లో ఈ విషయం స్పష్టమవుతోంది.