సినిమాలో నటించకపోతే 25 కోట్లు కట్టాలట!

Hera Pheri 3: బాలీవుడ్ కామెడీ హిట్ సిరీస్ ‘హేరా ఫేరి 3’ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈసారి కారణం కామెడీ కింగ్ పరేష్ రావల్ తీసుకున్న అనూహ్య నిర్ణయం. బాబురావుగా అభిమానులను ఏడిపిస్తూ నవ్వించిన ఆయన, షూటింగ్ మొదలైన తర్వాత ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో బాలీవుడ్ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ వ్యవహారం కోర్టు మెట్లదాకా వెళ్లేలా కనిపిస్తోంది.

అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న సినిమా నుంచి పరేష్ తప్పుకోవడంపై అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ తీవ్రమైన స్పందనతో ముందుకు వచ్చింది. రూ.25 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసు జారీ చేసింది. ఒప్పందంపై సంతకం చేసి, అడ్వాన్స్ తీసుకున్నాక అనూహ్యంగా ప్రాజెక్ట్ వదిలేయడం వృత్తి నైతికతకి విరుద్ధమని, దీని వల్ల షూటింగ్ షెడ్యూళ్లతో పాటు మార్కెటింగ్ వ్యయాలపైనా ప్రభావం పడిందని సంస్థ అభిప్రాయపడుతోంది.

పరేష్ మాత్రం తన నిర్ణయానికి సృజనాత్మక విభేదాలే కారణమని స్పష్టంగా చెప్పాడు. దర్శకుడు ప్రియదర్శన్‌పై తనకున్న గౌరవాన్ని ప్రస్తావిస్తూ, తన తప్పు ఏదీ కాదని చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే, ఇప్పుడు అతని స్థానాన్ని భర్తీ చేయాల్సి వస్తుందా? లేక వివాదం పరిష్కారానికి వస్తుందా? అన్నది అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఇప్పటికీ బాబురావు-రాజు-శ్యామ్‌ల ముగ్గురు మిత్రుల కామెడీ కాంబోను అభిమానులు మర్చిపోలేదు. మరి నెక్స్ట్ సీరీస్ లో ఈ కాంబినేషన్ కొనసాగుతుందో లేదో చూడాలి.