South Korea: దక్షిణకొరియా విమాన ప్రమాదంలో ఆ ఇద్దరే ఎలా బ్రతికారు?

దక్షిణకొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదం ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. ‘జెజు ఎయిర్’కు చెందిన ఈ విమానం రన్‌వేపై కూలి పూర్తిగా కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 181 మందిలో 179 మంది మరణించడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రాణాలతో బయటపడిన ఇద్దరు సిబ్బందే కావడం గమనార్హం. విమానం వెనుక భాగంలో కూర్చున్న వీరు అదృష్టవశాత్తు రక్షించబడ్డారు.

ఇంత పెద్ద ప్రాణనష్టం జరిగినప్పటికీ ఇద్దరు సిబ్బంది మాత్రమే ఎలా బతికారు? అనేది ఆసక్తికరంగా మారింది. వీరు విమానం వెనుక భాగంలో ఉండటమే రక్షణగా మారిందని నిపుణులు పేర్కొన్నారు. 2015లో ‘టైమ్ మ్యాగజైన్’ నిర్వహించిన అధ్యయనంలో కూడా విమానాల వెనుక సీట్లలో మరణాల రేటు తక్కువగా ఉండటం గుర్తించబడింది. మధ్య సీట్లలో 39 శాతం, ముందు భాగంలో 38 శాతం మరణాల రేటు ఉండగా, వెనుక భాగంలో ఈ రేటు కేవలం 32 శాతమే అని ఆ అధ్యయనం వివరించింది.

ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది మంటల్లో నుంచి 32 ఏళ్ల లీ, 25 ఏళ్ల క్వాన్ అనే ఇద్దరిని రక్షించారు. ఈ ప్రమాదంలో లీ ఎడమ భుజం విరిగి, తలకు గాయాలైంది. స్పృహలోకి వచ్చిన ఆమె, తనకు ఏమైందని, తాను ఎక్కడ ఉన్నానని పదేపదే ప్రశ్నిస్తూ కనిపించిందని వైద్యులు వెల్లడించారు. క్వాన్ కుడి చీలమండ విరిగి, తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నట్లు వైద్యులు వివరించారు. ఈ ఘటన విమాన ప్రయాణ భద్రతపై సార్వత్రిక చర్చకు దారితీస్తోంది. విమాన ప్రమాదాల నివారణ కోసం సాంకేతిక మార్పులు, అత్యవసర ఏర్పాట్లపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.