పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ చేస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. హిందీలో వచ్చిన ‘పింక్’ చిత్రానికిది రీమేక్. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఒరిజినల్ వెర్షన్ పూర్తిగా స్టోరీ బేస్డ్ కోర్ట్ రూమ్ డ్రామా. ఇందులో హీరో పాత్రకు ప్రాధాన్యం ఉన్నా అది కథానుగుణంగానే నడుస్తుంది తప్ప ఎక్కడా హైప్ కోసం క్రేజ్ చూపించదు. దీన్నే తమిళంలో ‘అజిత్’ రీమేక్ చేశారు. అజిత్ స్టార్ హీరో రేసులో ఉన్నా కూడ అక్కడా పెద్దగా మార్పులు చేయలేదు. కథానాయకుడి పాత్రలో అజిత్ కోసం కొంచెం బిల్డప్ పెంచారు అంతే.
కానీ తెలుగులో మాత్రం ఆ సరిహద్దులన్నింటినీ పూర్తిగా చెరిపేసినట్టే కనిపిస్తున్నారు. కథను పూర్తిగా పవన్ ఛరీష్మాకు అనుగుణంగా మార్చేశారట. రీఎంట్రీ సినిమా కాబట్టి పవన్ మీద అంచనాలు భారీగా ఉంటాయి. సాదాసీదా లాయర్ పాత్రలో ఆయన కనిపిస్తే అభిమానులు జీర్ణించుకోలేరు. అందుకే కథను పూర్తిగా హీరో కోణంలోకి తిప్పేశారట. కమర్షియల్ ఎంటర్టైనర్లో ఎలాంటి ఎలివేషన్స్ ఉంటాయో ఇందులో కూడ అలాంటి ఎలివేషన్స్, ఫైట్స్ ఉండనున్నాయి. కథాగమనాన్నే మార్చేసినా కథలో సోల్ మాత్రం మిస్సవకుండా జాగ్రత్తపడ్డారట మేకర్స్.