అలనాటి నటుడు కృష్ణంరాజు గురించి తెలియని వారంటూ ఉండరు. 180 కి పైగా సినిమాలలో నటించి రెబల్ స్టార్ గా గుర్తింపు పొందిన కృష్ణంరాజు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాడు. రాజ కుటుంబానికి చెందిన కృష్ణంరాజు తనని కలవడానికి వచ్చిన వారికి భోజనం పెట్టనిదే తిరిగి పంపేవాడు కాదు. అలా కృష్ణం రాజుని కలవటానికి ఎవరు వచ్చినా కూడా వారు కూడా భోజనం చేసి వెళ్లాల్సిందే. కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్ కి కూడా తన పెదనాన్న అలవాటు వచ్చింది.
ప్రభాస్ కూడా తాను పనిచేసే సినిమా యూనిట్ సభ్యులందరికీ స్వయంగా ఇంటి నుండి భోజనం తెప్పించేవాడు. అయితే కృష్ణంరాజు ఇలా తమ ఇంటికి వచ్చిన వారికి అతిధి మర్యాదలు ఇవ్వటానికి వెనుక కూడా ఒక కారణం ఉంది. కృష్ణంరాజు ఇండస్ట్రీలో అడుగుపెట్టకు ముందు జర్నలిస్ట్ గా పనిచేసేవారు. అటు తర్వాత నటన మీద ఉన్న ఆసక్తి వల్ల నటుడిగా మారి చిన్న చిన్న పాత్రలు చేయడం మొదలుపెట్టారు. రాజ కుటుంబానికి చెందిన కృష్ణంరాజు సినిమాలలో నటించడం తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో తన ఖర్చులకు ఇంట్లో వారిని డబ్బులు అడిగేవాడు కాదు.
ఇలా ఒకరోజు కృష్ణంరాజు వద్ద ఉన్న డబ్బులు మొత్తం అయిపోయి భోజనం చేయడానికి డబ్బులు లేక దాదాపు ఎనిమిది కిలోమీటర్లు నడిచి తన స్నేహితుడిని అప్పు అడిగాడు. కృష్ణంరాజు మనసు తెలుసుకున్న తన స్నేహితుడు కృష్ణంరాజుకి కడుపునిండా భోజనం పెట్టి డబ్బులు అప్పు ఇచ్చి మరి పంపించాడట. ఇక అప్పటినుండి కృష్ణంరాజు తన ఇంటికి వచ్చిన వారికి లేదనకుండా కడుపునిండా భోజనం పెట్టి పంపించేవారు. ఇలా ఆకలి బాధలు భరించిన కృష్ణంరాజు తన ఇంటికి వచ్చిన వారికి అతిధి మర్యాదలు చేసే భోజనం పెట్టి పంపించేవారని సమాచారం.