అందమైన తెలంగాణ… ఇక్కడికెళితే తిరిగి రావాలనిపించదు

ఉషోదయపు వేళ చల్లగా తాకుతున్న మంచు తెరలు మనసుని ఆహ్లాదపరుస్తున్నాయి. వరంగల్ నుంచి తాడ్వాయి బయలుదేరిన మేము ములుగు కు ముందు గట్టమ్మ ఆలయంలో దర్శనం చేసుకున్నాము.

వరంగల్ నుంచి 97 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడ్వాయి లో ఈ మధ్యనే అటవీ శాఖ వారు ఎకో టూరిజం ను అభివృద్ధి పరుస్తున్నారు. ములుగు నుంచి రోడ్డు కి ఇరువైపులా ఆకాశాన్నంటుతున్నట్లు పెరిగిన చెట్లు మనసుని రంజింపచేస్తున్నాయి. ఎటుచూసినా పచ్చటి ప్రకృతి మైమరపింపజేస్తుంది. తాడ్వాయి చేరుకునేసరికి 11 గంటలైంది. అక్కడే అటవీ శాఖ నిర్వహిస్తున్న కాటేజిస్ కి వెళ్ళాము. మొత్తం 5 కాటేజీలు ఉన్నాయి. వసతులు సూపర్ గా ఉన్నాయి. గిజర్, ఏసీ, టీవీ లాంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. అన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. చుట్టూ పొడవైన వృక్షాలు, పక్షుల కిలకిలా రావాలతో ఆ ప్రాంతం చాలా బాగుంది.

ఫ్రెషప్ అయ్యాక సైక్లింగ్ కోసం కాటేజీలను అనుకోని ఉన్న అడవుల్లోకి వెళ్ళాము. ఇక్కడ సైకిళ్ళు కూడా అటవీశాఖ ఏర్పాటుచేసింది. ఏపుగా పెరిగిన దట్టమైన అడవుల్లో సైక్లింగ్ సరదాగా అనిపించింది. పట్నం వాతావరణానికి దూరంగా అడవుల్లో సేదదీరాడం మనసుకి హాయిని కలిగించింది. అడవుల్లో తప్పిపోకుండా అటవీశాఖ సిబ్బంది మమ్మల్ని గైడ్ చేస్తూ అడవిని తిప్పి చూపించాడు. నల్ల మద్ది, తెల్లమద్ది టేకు, సహా పలు భారీ వృక్షాలు తాడ్వాయి అడవుల్లో ఉన్నాయి. తిరిగి కాటేజీలను చేరుకున్న మాకు అక్కడి సిబ్బంది వేడి వేడిగా మధ్యాహ్న భోజనాలు సిద్ధం చేశారు. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక తాడ్వాయి కి 10 కిలోమీటర్ల దూరంలోని బ్లాక్ బెర్రీ ఐలాండ్ కి తీసుకెళ్లారు. కొద్దీ దూరం అడవిలో నడిచాక బ్లాక్ బెర్రీ ఐలాండ్ చేరుకున్నాం. మరో సుందరమైన ప్రదేశాన్ని చూసాక మనసు ఆగలేదు. జంపన్న వాగు సన్నగా పారుతుంది. వాగులో ఎక్కడికక్కడ ఇసుక మేటలేసి ఉంది. ఒక చిన్న సైజ్ బీచ్ ల అక్కడ అనిపించింది. వయసుని మర్చిపోయి వాగులో, ఇసుకలో సరదాగా గడిపాము. పక్కనే ఉన్న వాచ్ టవర్ ఎక్కి చుట్టూ వున్న అడవిని చూసాము. కనుచూపు మేర పచ్చదనంతో అడవి దట్టంగా కనిపించింది.

తిరిగి వస్తూ ఉంటే గుడ్డేలుగు లు తవ్విన గుంతలు,పాములు విడిచిన కుబుసాలు అన్ని చూపిస్తున్నాడు గైడ్.ఒక చోట 10 అడుగుల పొడవైన కుబుసాన్ని చూసి ఆ పాము ఎంత పెద్దదో మనసులోనే ఊహించాను. దారిలో పూర్తిగా రాతి పై సన్నగా పారుతున్న జంపన్న వాగు సోయగాలు చూసాము.అక్కడ ఇసుక మట్టి లేకుండానే రాతిపై వాజ్ పారడం ఆశ్చర్యం వేసింది.మళ్ళీ కాటేజీలకు చేరుకోగానే అక్కడి సిబ్బంది కాంప్ ఫైర్ వేసి నైట్ డిన్నర్ వడ్డించారు. సన్నటి నిప్పు వేడి తగులుతుండగా డిన్నర్ ముగించి కాటేజీల్లోకి వెళ్లిపోయము. పొద్దున్నుంచి బాగా తిరగడంతో వెంటనే నిద్ర పట్టేసింది.

 

మరుసటి రోజు ఉదయం 6 గంటలకే రెడీ అయి అడవి అందాలు చూడటానికి బయలుదేరాము. కార్ లో వెళ్తుంటే అక్కడక్కడ చిన్న చిన్న ఊర్లు కనిపించాయి. తాడ్వాయి నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణం చేసాక దామర వాయి చేరుకున్నాము. దామరవాయి లో రాక్షస గుళ్ళు చూసాము.6000 సంవత్సరాల క్రితం మనిషి చనిపోతే అతన్ని పాతి పెట్టి పైన పెద్ద పెద్ద రాళ్లు ఉంచి గుళ్లుగా మార్చేవారని తెలిసిందిఐదేళ్ల క్రితం వీటిని కనుగొన్నారని తెలిసింది. ఇక్కడ పరిశోధకులు పరిశోధనలు చేస్తున్నారని తెలుసుకున్నాం. అక్కడి నుంచి తిరిగి కాటేజీలకు చేరుకున్న మాకు వేడి వేడి గా టిఫిన్ అందించారు. టిఫిన్ చేసి చిన్నబోయిన పల్లి మీదుగా 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి కొండాయి అనే ఊరు చేరుకున్నాం. కొండాయి దగ్గర్లో ఉన్న కొండేటి వ్యూ పాయింట్ నుంచి కనుచూపు మేర కనబడే అడవి ని చూస్తూ ఉండిపోయాము. అక్కడే ఉన్న వాచ్ టవర్ల పైకి ఎక్కి జంపన్న వాగు ను చూసాము. రాత్రిపూట అడవి జంతువులు నీళ్లు తాగడం కోసం వచ్చిన అడుగుజాడలు వాగులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలాసేపు అక్కడ గడిపాక దగ్గర్లోని ఏటూరునాగారం దాటి గోదావరి పై ఏర్పాటు చేసిన కొత్త బ్రిడ్జి ని చూసాము.

మొత్తం మీద అటవీశాఖ నిర్వహిస్తోన్న ఈ తాడ్వాయి ఎకో టూరిజం చాలా బాగుంది.ఇద్దరికి కలిపి రోజుకు 2 వేలు వసూలు చేస్తారు.దాంట్లోనే ఉదయం టిఫిన్, మధ్యాన్నం ,రాత్రి భోజనాలు అందిస్తారు.సైక్లింగ్ ఛార్జీలు కూడా అందులో భాగమే కాబట్టి పెద్దగా మనకు ఖర్చు అనిపించదు. ఇతర రాష్ట్రాల్లోని ఎకో టూరిజం తో పోలిస్తే ఇది చాలా తక్కువే.ఉదయం 9 గంటలనుంచి మరుసటి రోజు ఉదయం 9 గంటలవరకు కాటేజీలు ఇస్తారు. ఇక్కడి సిబ్బంది మర్యాదగా ప్రవర్తిస్తూనే మనకు అన్ని విషయాలు చెబుతారు. ఇక్కడ ఉన్న వన్యప్రాణి అధ్యయన శాల సహా చాలా ప్రాంతాలు చూడొచ్చు. బోగత జలపాతం ఇక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లక్నవరం కూడా దగ్గరే. రెండు రోజుల పాటు సరదాగా స్నేహితులతో అయిన కుటుంబ సభ్యులతో అయిన గడపొచ్చు. వీలైతే మీరు కూడా ఒక ట్రిప్ వేయండి. కాంక్రిట్ జంగల్ నుంచి రియల్ జంగల్ లోకి…

తాడ్వాయి చేరుకోవాలంటే ఇలా వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి వరంగల్ కి రైళ్లు, బస్సులు విరివిగా ఉన్నాయి. వరంగల్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి ఉంటుంది. వరంగల్ నుంచి తాడ్వాయ్ కి ఆర్టీసి బస్సులున్నాయి. ఉదయం 10 గంటలలోపు తాడ్వాయి లో ఉంటే బెట్టర్. మన సొంత వెహికిల్ ఉంటే ఇంకా నయం. చాలా ప్రదేశాలు చూడొచ్చు.

 

 

రచయిత – బోండ్ల చంద్రశేఖర్, జర్నలిస్ట్, హైదరాబాద్.

సెల్. నెంబర్. 99639 96704