ప్రైవేట్ రంగానికి చెందిన సిటీ బ్యాంక్‌ను ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాం కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. సిటీ బ్యాంక్ కన్సూమర్ బిజినెస్, ఎన్‌బీఎఫ్‌సీ బిజినెస్ అన్నింటినీ యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసినట్లు గత ఏడాది మార్చి నెలలో యాక్సిస్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది.దీని కోసం రూ. 12,325 కోట్లు డీల్ కుదుర్చుకున్నట్లు తెలిపింది. నగదు రూపంలోనే ఈ డీల్ జరిగింది. దీంతో మార్చి 1వ తేదీ 2023 నుండి ఈ బ్యాంక్ ని పూర్తిగా యాక్సిస్ బ్యాంకు విలీనం చేసుకుంది. సిటీ బ్యాంక్ బ్రాంచులు అన్నీ యాక్సిస్ బ్యాంక్ బ్రాంచులుగా పని చేస్తాయి.
ఈ బ్యాంక్ కొనుగోలు ప్రక్రియ పూర్తి కావడానికి ఏడాది పడుతుందని యాక్సిస్ బ్యాంక్ గతేడాది ప్రకటించింది. ఇక ఇప్పుడు తాజాగా మార్చి 1 కల్లా ఈ కొనుగోలు పూర్తి అవుతుందని వెల్లడించింది. అంటే వచ్చే నెల నుంచి సిటీ బ్యాంక్ కస్టమర్లు అందరూ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లుగా మారిపోతారు. సిటీ బ్యాంక్ కన్సూమర్ బిజినెస్‌లో లోన్స్, క్రెడిట్ కార్డులు, వెల్త్ మేనేజ్‌మెంట్, రిటైల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ వంటివి ఉన్నాయి. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు పోర్ట్‌ఫోలియో చాలా పటిష్టంగా ఉంది.
యాక్స్సిస్ బ్యాంక్ తో సీటీ బ్యాంక్ కుదుర్చుకున్న డీల్ ప్రకారం సిటీ బ్యాంక్ కి చెందిన 25 లక్షల మంది క్రెడిట్ కార్డు యూజర్లు, రూ. 50,200 కోట్ల డిపాజిట్లు యాక్సిస్ బ్యాంక్ సొంతం కానున్నాయి.అంతేకాకుండా వచ్చే నెల నుండి సిటీ బ్యాంక్‌కు చెందిన 7 ఆఫీసులు, 21 బ్రాంచులు, 499 ఏటీఎంలపై కూడా సర్వ హక్కులు యాక్సిస్ బ్యాంక్ చేతికి వెళ్లనున్నాయి. దీని వల్ల యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ బ్యాలెన్స్ షీటు 57 శాతం మేర పెరగనుంది. దీంతో దేశంలో టాప్ 3 క్రెడిట్ కార్డు కంపెనీల జాబితాలోకి యాక్సిస్ బ్యాంక్ వచ్చి చేరనుంది.