వర్షాకాలం వచ్చిందంటే చల్లదనంతో పాటు అనారోగ్య భయాలు కూడా మొదలవుతాయి. ఆ సమయంలో జలుబు, జ్వరాలు, కడుపునొప్పులు, జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సీజన్‌లో ఏమి తింటున్నామనే విషయం మన ఆరోగ్యంపై బాగా ప్రభావం చూపిస్తుంది. వర్షాకాలంలో కొన్ని ఆహార పదార్థాలు మనకు సర్వసాధారణంగా మంచివిగా అనిపించినా, అవే కొన్ని సందర్భాల్లో ముప్పుగా మారవచ్చు. అందుకే వాటిని తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మ, కమల, ముసంబి లాంటి పండ్లను వర్షకాలంలో తినొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇవి బయట కట్ చేసి అమ్ముతారు, వాటిపై వర్షపు నీరు పడడం వల్ల బాక్టీరియా, వైరస్‌లు చేరే అవకాశం ఉంటుంది. వాటిని తినడం ద్వారా ఫుడ్ పొయిజనింగ్, విరేచనాలు, జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
అలాగే వర్షాల్లో రోడ్డుపక్కన అమ్మే పానీపూరీ, బజ్జీలు, సమోసాలు లాంటి స్ట్రీట్ ఫుడ్ తీసుకోవడం ప్రమాదకరం. వర్షపు నీటి కారణంగా చుట్టుపక్కల అపరిశుభ్రత పెరిగి, ఆహారం కలుషితమవుతుంది. ఇలా కలుషితమైన భోజనం తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా వర్షాకాలంలో చాలామంది చల్లని పానీయాలను ఎక్కువగా తాగుతుంటారు. ముఖ్యంగా కార్బొనేటెడ్ డ్రింక్స్‌ను. ఇవి కడుపులో తేలికగా జీర్ణం కాకపోవడంతో పాటు గ్యాస్, అజీర్ణం లాంటి సమస్యలకు దారి తీస్తాయి. ఇది జీర్ణవ్యవస్థపై భారం వేస్తుంది.
అలాగే వర్షాకాలంలో చాలామంది టీ, కాఫీలు ఎక్కువగా తాగుతుంటారు. వాతావరణం చల్లగా ఉండటంతో వేడిగా ఏదైనా తాగాలనిపిస్తుంది. కానీ వీటిని ఎక్కువగా తాగడం వల్ల జీర్ణక్రియ మందగించి, గ్యాస్, బ్లోటింగ్ లాంటి సమస్యలు రావచ్చు. ఒక్కసారి అలాంటి సమస్యలు మొదలైతే, ఎలాగైనా పరిష్కరించుకోవడానికి సమయం పడుతుంది. ఇక పెరుగు, మజ్జిగలు ఆరోగ్యానికి మంచివే అయినా, వర్షాకాలంలో వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. తడి వాతావరణంలో పెరుగు శీతలతను కలిగించి, కడుపు సమస్యలకు కారణం కావచ్చు.
మొత్తంగా చూసుకుంటే… వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే తినే ఆహారంలో కూడా జాగ్రత్త అవసరం.. సులభంగా అరగే, ఇంట్లో తయారైన పదార్థాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. బయట ఆహారానికి, సన్నగా కనిపించే కానీ ప్రమాదకరమైన అలవాట్లకు కొంత కాలం బ్రేక్ ఇచ్చితేనే ఆరోగ్యంగా వర్షాలను ఆస్వాదించవచ్చు.