నోటి దుర్వాసనతో నలుగురిలో మాట్లాడడానికి సంకోచిస్తున్నారా? ఈ చిట్కాలు మీకోసమే!

ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో నోటి దుర్వాసన సమస్య కూడా ప్రధానమైనది గానే చెప్పవచ్చు. నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు నలుగురిలో తమ భావాలను వ్యక్తపరచడానికి సంకోచిస్తుంటారు. నోటి దుర్వాసనకు అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా చిగుళ్ల సమస్యలు, పళ్ళు పుచ్చిపోవడం, నోటి ఇన్ఫెక్షన్లు, సరిగా బ్రష్ చేసుకోకపోవడం, జీర్ణ సంబంధిత వ్యాధులు, శ్వాస సంబంధిత వ్యాధులు, డయాబెటిస్ ,పొగ తాగడం వంటివి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. నోటి దుర్వాసన సమస్యను నిర్లక్ష్యం చేస్తే అనేక ఇన్ఫెక్షన్లతో నోటి క్యాన్సర్ కు దారి తీసే ప్రమాదం ఉంది. కావున నోటి దుర్వాసన సమస్యను తరిమికొట్టే అద్భుతమైన చిట్కాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మనం తిన్న ఆహారం పళ్ళ సందుల్లో కొంత ఇరుక్కొని ఉండిపోతుంది. అలా ఎక్కువ సమయం గడిస్తే పళ్ళ సందుల్లో హానికర బ్యాక్టీరియా పెరిగి దంత క్షయం, చిగుళ్ల సమస్య ఏర్పడుతుంది. దీంతో నోటి నుంచి దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది. కావున ప్రతిరోజు ఉదయం , రాత్రి భోజనం చేసిన తర్వాత తప్పకుండా బ్రష్ చేసుకొనే అలవాటు చేసుకోవాలి. వీలైతే ఆహారం తిన్న ప్రతిసారి నోటిని శుభ్రం చేసుకోవడం, నోటిని పుక్కిలించిడం మంచిది.

నోరు, గొంతు, నాలుక పొడి బారిన నోటి దుర్వాసన వస్తుంది. కావున ప్రతి రెండు గంటలకు ఒక గ్లాసుడు మంచినీళ్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యానికి తోడ్పడే విటమిన్ డి, విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.

మిరియాల పొడి, పసుపు, ఉప్పు, నువ్వుల నూనె మిశ్రమాన్ని మెత్తని పేస్టులా చేసి ప్రతిరోజు పళ్లు తోమితే చిగుళ్ల సమస్యలు తొలగి నోటి దుర్వాసన తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

భోజనం చేసిన తర్వాత చిటికెడు సోంపు తింటే నోటి దుర్వాసన తగ్గుతుంది. అలాగే రెండు తులసి ఆకులను పుదీనా ఆకులను బాగా నమిలితే ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ ఇన్ఫెక్షన్ గుణాలు ప్రమాదకర బ్యాక్టీరియాతో పోరాడి నోటి దుర్వాసనను అరికడుతుంది.

పసుపులో యాంటీ బ్యాక్టీరియా గుణాలు పుష్కలంగా ఉన్నాయి కావున పసుపు ఉప్పు కలిపిన నీళ్లతో నోటిని పుక్కిలించి శుభ్రం చేసుకుంటే నోటి దుర్వాసన తగ్గిపోతుంది.

ప్రయాణాల్లో ఉన్నప్పుడు అత్యవసరం అనుకుంటే మౌత్ వాష్, చూయింగ్ గమ్ వంటివి నా మరడం వల్ల
వీటిలో మెంథాల్ ఔషధ గుణాలు నోటి దుర్వాసనను పోగొడుతుంది.

పొగాకు నమలడం, పొగ తాగడం వంటివి చేస్తే దంతాలకు హాని జరిగి చిగుళ్ల సమస్య ఏర్పడుతుంది దాంతో నోటి దుర్వాసన ప్రారంభమవుతుంది. కావున వీటికి దూరంగా ఉండడం మంచిది. నోటి దుర్వాసన సమస్య మరీ తీవ్రతరంగా ఉంటే దంత వైద్య నిపుణులును సంప్రదించాలి.