శ్రేయస్సు, సంపద, సిరిసంపదల పండుగగా భావించే ధన్‌తేరాస్ (ధన త్రయోదశి) ఈ ఏడాది అక్టోబర్ 18న రానుంది. దీపావళి వేడుకలకు ఆరంభ ఘడియగా పరిగణించే ఈ ప్రత్యేక రోజున దేశవ్యాప్తంగా హిందువులు సంపదల దేవత లక్ష్మీ దేవి ఆరాధన చేస్తారు. ఈ రోజు బంగారం, వెండి, ఎలక్ట్రానిక్ వస్తువులు, చీపుర్లు వంటి వస్తువులను కొనుగోలు చేస్తే ఇంటికి శుభం చేకూరుతుందని విశ్వాసం ఉంది. యమదీపం వెలిగించడం, అన్నదానం చేయడం వంటివి చేస్తే ఇంటిలో ఆర్థికాభివృద్ధి జరుగుతుందని పురాణాల చెబుతున్నాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి తగిన వస్తువులను ఈ రోజున కొనుగోలు చేస్తే ఆర్థిక స్థిరత్వం, శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం. అందుకే రాశి ఆధారంగా ఏం కొనుగోలు చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మేష రాశి వారు ఈ రోజు బంగారం లేదా ఎర్ర రంగు వస్తువులను కొనుగోలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు.
వృషభ రాశి వారికి వెండి కాయిన్స్ లేదా ఆభరణాలు కొనుగోలు చేయడం శుభప్రదం.
మిధున రాశి వారికి పుస్తకాలు, స్టేషనరీ, గాడ్జెట్లు వంటి వస్తువులు అదృష్టాన్ని రప్పిస్తాయి.
కర్కాటక రాశి వారు రాగి లేదా కాంస్య వంటింటి సామగ్రి కొంటే ఇంటిలో సంపద స్థిరపడుతుంది.
సింహ రాశి వారికి బంగారం, కాయిన్స్, ఆభరణాలు శ్రేయస్సు తీసుకువస్తాయి.
కన్య రాశి వారు ఆరోగ్యానికి, శుభ్రతకి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడం శ్రేయస్కరం.
తులా రాశి వారు వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తే అదృష్టం కలిసివస్తుంది.
వృశ్చిక రాశి వారు బంగారు కాసులు, ఎర్రటి వస్తువులు కొనుగోలు చేస్తే ఆర్థిక లాభాలు పొందే అవకాశముంది.
ధనుస్సు రాశి వారికి ట్రావెల్ లేదా చదువుకు సంబంధించిన వస్తువులు శుభాన్ని చేకూరుస్తాయి.
మకర రాశి వారు మెటల్ వస్తువులు లేదా గృహోపకరణాలు కొనుగోలు చేస్తే బాగుంటుంది.
కుంభ రాశి వారికి గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, వెండి కాయిన్స్ అదృష్టాన్ని పెంచుతాయి.
మీన రాశి వారు బంగారం లేదా నీటికి సంబంధించిన డెకర్ వస్తువులు కొంటే ధనలాభం కలుగుతుందని నమ్మకం.
ధన్‌తేరాస్ రోజున కేవలం వస్తువులు కొనడం మాత్రమే కాదు, శుభ ముహూర్తంలో కొనుగోలు చేయడం కూడా కీలకం. సాయంత్రం వేళల్లో శుభప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. చిన్న చిన్న వస్తువులు అయినా శ్రద్ధగా, భక్తితో కొనుగోలు చేస్తే అది శుభాన్ని రప్పిస్తుందని విశ్వాసం.
అలాగే ఈ రోజున ఇంటి ముందర దీపాలు వెలిగించడం, తులసి మొక్క దగ్గర దీపం పెట్టడం శ్రేయస్సును, ఆర్థికాభివృద్ధిని కలిగిస్తుందని చెబుతారు. పేదవారికి అన్నదానం చేయడం, ఆవులకు ఆహారం పెట్టడం వంటి సేవా కార్యక్రమాలు చేసేవారికి దేవీ కటాక్షం లభిస్తుందనే విశ్వాసం ఉంది. ఈ ధన్‌తేరాస్ పండుగను మీ కుటుంబంతో ఆనందంగా జరుపుకుంటూ, రాశి ఫలితాల ప్రకారం సరైన వస్తువులు కొనుగోలు చేసి సంపద, శ్రేయస్సు మీ ఇంటిని నింపుకోండి. (గమనిక: ఈ కథనం పండితులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది.. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)
