అరటిపండు చాలా మందికి ఇష్టమైన పండు. తీపి రుచితో.. తక్షణ శక్తిని ఇచ్చే ఈ పండు ఉదయం అల్పాహారంలోనూ, సాయంత్రం స్నాక్‌లాగానూ తరచూ తింటుంటారు. అయితే ఈ పండు ఎప్పుడూ కొంచెం వంకరగా ఉండటాన్ని గమనించే ఉంటారు. ఏ జాతి అరటిపండైనా.. ఏ దేశంలో పండినదైనా ఇది కాస్త వంగి ఉంటుంది.. అయితే ఎందుకు అరటి పండు నిటారుగా కాకుండా ఎందుకు ఇలా వంగి పెరుగుతుందనే ప్రశ్న చాలామందికి వస్తుంది. ఈ వంకర వెనుక ఉన్న సైన్స్ తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఈ కథనంలో దాని గురించి తెలుసుకుందాం.
అరటిపండ్లు వంకరగా పెరగడానికి ప్రధాన కారణం ఫోటోట్రోపిజం. ఇది మొక్కలు సూర్యకాంతి వైపు పెరుగుదల జరిపే సహజ ప్రక్రియ. అరటి చెట్టు ఫలాలు మొదట కిందికి వంగి పెరుగుతాయి. కానీ పండు పెరిగేకొద్దీ, దానిలోని కణాలు సూర్యరశ్మి వైపు తిరగడం ప్రారంభిస్తాయి. ఈ సమయంలో అవి నెమ్మదిగా పైకి పెరిగి వంగుతాయి. దీనినే ‘నెగటివ్ జియోట్రోపిజం’ అంటారు. అంటే గురుత్వాకర్షణకు వ్యతిరేక దిశలో పెరుగుదల జరగడం. ఈ ప్రక్రియ వల్లే అరటిపండ్లు సహజంగానే ఆ అందమైన వంకర ఆకారం పొందుతాయి.
అయితే ఈ ఆకారం పండుకు రుచికి సంబంధం లేదు. రుచి ప్రధానంగా అరటిపండు జాతి, నేల, వాతావరణం, పండిన స్థాయిపై ఆధారపడి ఉంటుంది. కానీ వంకర రూపం మాత్రం మరో ప్రత్యేకతను ఇస్తుంది.. పండులోని విత్తనాలు, పోషకాలను రక్షించడం. అంతేకాదు, తొక్క తీయడాన్ని సులభతరం చేస్తుంది. తినేటప్పుడు కూడా ఈ ఆకారం మనకు సౌకర్యం కలిగిస్తుంది.
అరటిపండు సహజ చక్కెర, ఫైబర్, పొటాషియం వంటి అనేక పోషకాల ఖజానా. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. అలసట, బలహీనతను తగ్గిస్తుంది. వ్యాయామానికి ముందు లేదా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో అరటిపండు తినడం శరీరానికి శక్తినిచ్చే మంచి అలవాటు. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రక్తపోటును నియంత్రిస్తుంది. ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం శరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే.. అరటిపండు వంకరగా ఉండటమే దాని ప్రత్యేకత. ఇది కేవలం సూర్యకాంతి కోసం తలెత్తిన ప్రకృతి అందం మాత్రమే కాదు, ఆరోగ్యానికి అపారమైన వరం కూడా. కాబట్టి ఈ సారి అరటిపండును చేతిలో పట్టుకున్నప్పుడు, దాని వంకరలో దాగి ఉన్న ఈ అద్భుత కథను గుర్తు పెట్టుకోండి.
