ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ మెకానిజం తో ఆధార్ భద్రత మరింత పటిష్టం..?

29_05_2022-aadhar_227546831666951873071

దేశంలో పెరుగుతున్న టెక్నాలజీ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని ఎంతోమంది సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో సైబర్ మోసాలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ లో కొత్త సాంకేతిక మార్పులు చేస్తోంది. ఫలితంగా ఆధార్ కార్డు మరింత సురక్షితంగా మారనుంది. ఆధార్‌తో జరిగే మోసాల నుండి ప్రజలను రక్షించడానికి భారత ప్రభుత్వం రెండు దశల భద్రతా యంత్రాంగాన్ని ప్రారంభించింది. ఈ యంత్రాంగం ద్వారా ఎవరైనా ఆధార్ సహాయం తో మోసం చేయడానికి ప్రయత్నిస్తే, వెంటనే గుర్తించవచ్చు.

అధికారిక ప్రకటన ప్రకారం యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI), ఎలక్ట్రానిక్స్, IT మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ మెకానిజం ద్వారా ఆధార్ నంబర్ బయోమెట్రిక్ ప్రామాణీకరణ మరింత పటిష్టంగా, సురక్షితంగా మారనుంది. ఆధార్ కార్డు ద్వారా జరిగే మోసాలకు ఈ సరికొత్త మెకానిజం ద్వారా అడ్డుకట్ట వేయనుంది. ఆధార్ ఆధారిత వేలిముద్ర ధృవీకరణ, మోసపూరిత ప్రయత్నాలను వేగంగా గుర్తించడం కోసం UIDAI కొత్త భద్రతా యంత్రాంగాన్ని ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని సంస్థ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) ఆధారిత సెక్యూరిటీ సిస్టమ్ ఇప్పుడు నమోదు చేసుకున్న వేలిముద్ర ధృవీకరణ కోసం ‘ఫింగర్ ప్రింట్ మ్యాచింగ్’ని ఉపయోగిస్తోంది. వేలిముద్ర ఆధారిత ఆధార్ ధృవీకరణ కోసం కొత్త భద్రతా యంత్రాంగాన్ని ప్రకటిస్తూ, “ఇది ఆధార్ ధృవీకరణను మరింత పటిష్టంగా, సురక్షితంగా మారుస్తుంది” అని UIDAI ఒక ప్రకటనలో పేర్కొంది. దీని ద్వారా ఇకపై ఆధార సంబంధిత మోసాలకు పుల్ స్టాప్ పెట్టనున్నారు.