ఏ విషయంలోనైనా ‘అతి’ ఎక్కువైతే అనర్థదాయకం అని పెద్దలు చెబుతుంటారు. చిన్నపిల్లల పెంపకానికి సంబంధించి కూడా ఈ మాట వర్తిస్తుంది. పిల్లల పెంపకం అన్నది తల్లిదండ్రులకు నేడు నిజంగా కత్తిమీద సాము లాంటిదే. వారిని అతిగా గారాబం చేసినా, వారి పట్ల మరీ కఠినంగా వ్యవహరించినా పేరెంట్స్ తప్పే అవుతుంది. ఎప్పుడూ తల్లులను అంటిపెట్టుకుని వుండే పిల్లలు మిగతా చిన్నారులతో పోలిస్తే తక్కువ స్థాయిలో నైపుణ్యాలు కలిగి ఉంటారట! పిల్లల చదువులు, ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు తగినంతగా శ్రద్ధ చూపాల్సిఉన్నా, అయినదానికీ కానిదానికీ మితిమీరి ఆందోళన చెందనక్కర్లేదు. వారిలో ఏ మాత్రం చురుకుదనం తగ్గినా, కొద్దిపాటి అనారోగ్యానికి గురైనా తగురీతిలోనే స్పందించాలి తప్ప అనవసరంగా బెంబేలెత్తిపోనక్కర్లేదు. కొందరు తల్లిదండ్రులు ముందుజాగ్రత్త నెపంతో ఆస్పత్రులకు పరిగెత్తటం, అవసరం వున్నా లేకున్నా పిల్లల చేత మందులు మింగించటం చేస్తారు. వాస్తవంగా ఆలోచించాలే తప్ప పిల్లల విషయంలో ప్రతిదానికీ హైరానా పడాల్సిన పనిలేదు.
ఆహారం సరిగ్గా తినకపోవటం, నీరసించి పోవడం, చురుకుదనం లోపించటం వంటివి చాలామంది పిల్లల్లో కనిపించే లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించినపుడు పేరెంట్స్ మరీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు అతిగా ప్రవర్తించడం వల్ల విపరిణామాలు తప్పవని వైద్య నిపుణులు చెబుతుంటారు. క్రమశిక్షణతో పిల్లల్ని పెంచడం ఎంత అవసరమో వారికి కొంత స్వేచ్ఛ కూడా ఇస్తుండాలి. ఎప్పుడూ తమని అంటిపెట్టుకునే విధంగా పిల్లలు ఉండాలని భావించకూడదు. చిన్నారులపై పర్యవేక్షణ ఉండాలి. కానీ, వారిని ఆంక్షల చట్రాల్లో బంధించకూడదు. తమ మనోభావాలను పిల్లలు పేరెంట్స్‌తో ధైర్యంగా చెప్పుకునేలా స్వేచ్ఛను ఇవ్వాలి. డాక్టర్ల సూచన మేరకు అన్నట్టు కాకుండా ఇంట్లో లేదా చుట్టుపక్కల పెద్దవారు వుంటే వారి సలహాలు, సూచనలు పాటించండి. ఇక, పిల్లలకు జలుబు, జ్వరాలు, అజీర్ణం లాంటివి వస్తే ఏదో అయిపోయిందని కంగారుపడకండి. చిన్న చిన్న కష్టాలు, సమస్యల్ని అధిగమించేలా వారికి బాల్యం నుంచే నేర్పడం ద్వారా భవిష్యత్తులో వారు ధైర్యవంతులుగా నిలుస్తారన్న విషయం మరువకండి.
పిల్లలు చేసే పనులు, అల్లరి, ఆటలు వారి సృజనాత్మకతను పెంచేవిగా వుంటాయి. వారు తమంతట తాముగా అన్ని విషయాలు గ్రహించేలా తోడ్పడండి. పిల్లల పెంపకం ఒక సవాల్‌గా కాకుండా బాధ్యతగా పేరెంట్స్ చేపట్టాలి. చిన్నారులతో మమకారం, స్నేహపూరిత వాతావరణం పెంచుకోండి. పిల్లల పెంపకంలో రానురాను బాధ్యతలు పెరుగుతాయి. ఇంటాబయటా సమస్యలు ఒత్తిళ్లకు గురిచేస్తాయి. విసుగు ప్రవేశిస్తుంది. ఈ క్రమంలో కుటుంబ పెద్దల అనుభవాలు, వారు చెప్పే సలహాలు పాటిస్తే ఆందోళన చెందనక్కర్లేదు. అందుకనే అదివరకటి రోజుల్లో పిల్లల పెంపకం విషయంలో ఎవ్వరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు ఎందుకంటే ఉమ్మడికుటుంబంలో అందరూ ఉంటారు. మంచి చెడులు అన్నీ తెలుస్తాయి. ప్రస్తుతం పరిస్థితులు అలా లేవు కాబట్టి కనీసం వారి సూచనల మేరకు నడిచినా పిల్లల విషయంలో అలా ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు.