ప్రశ్న : 50 వేలకు పైగా పాటలు పాడారని చెబుతారు, నిజమేనా?
ప్రశ్నకు జేసుదాస్ సమాధానం ఇది
– నాకు తెలియదు బంగారం.. నిజంగా నేను ఎన్ని పాటలు పాడానో నాకు తెలియదు. నేను 1961 నవంబర్ 14 నుంచి పాడుతూనే ఉన్నా. నిన్నొకరు వచ్చి 77వేలు పాటలు పాడానని అన్నారు. నేనెప్పుడూ లెక్కలు వేసుకోలేదు. మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, మరాఠీ, గుజరాతీ …అన్నీ భాషల్లోనూ పాడాను. ఇక్కడే నా మనసులో ఉన్న ఓ కొరత గురించి చెప్తాను వినండి. నాకు జానకమ్మను చూస్తే చాలా జెలసీగా ఉంటుంది. ఈ జలసీ ఆమె పాడే పాటల గురించి కాదు. ఆమె చాలా గొప్ప గాయని. ఆమెకు నమస్కరించాలి. నమస్కరిస్తాను. అయితే నేను జెలస్ ఫీలయ్యే విషయం ఏంటంటే.. ఆమె `ఏ పాటను ఏ స్టూడియోలో పాడారు. ఎక్కడ నిలబడి పాడారు. చుట్టూ ఎవరున్నారు? ఎంత సేపు పాడారు? ఎన్ని సార్లు రిహార్సల్స్ చేశారు.. ` వంటివన్నిటినీ ఎప్పటికప్పుడూ చిన్న పుస్తకంలో నోట్ చేసుకునేవారు. ఇంటికెళ్లి పెద్ద పుస్తకంలో తిరగ రాసుకునేవారు. నేను కూడా ఆమెను చూసి కాస్త నేర్చుకున్నా. అయితే బ్యాడ్‌లక్ ఏంటంటే.. నేను రాసిపెట్టుకున్న రెండు డైరీలు కనిపించకుండా పోయాయి. పోయాయంటే.. నా అశ్రద్ధ వల్ల పోయాయనుకోకండి. ఎలా పోయాయో కూడా నాకింకా అర్థం కావడం లేదు. అయితే నాకు ఆ రోజు అర్థమైన విషయం ఒకటే.. భగవంతుడు నాతో ఆ రోజు ఒక విషయం చెప్పదలచుకున్నాడని. అదేంటంటే.. `నీకు ఈ లెక్కలు గిక్కలు పనికి రావు. పాడే వరకు పాడుతూనే ఉండు` అని. అందువల్ల `ఇన్ని పాటలు పాడారు.. అన్ని పాటలు పాడారు`.. అని ఎవరూ ఎప్పుడూ నాతో చెప్పొద్దు. ఎందుకంటే నా దగ్గరే లెక్కలు లేవు కాబట్టి. నా లెక్క ఏంటంటే.. ఇప్పుడు కూడా… ఓ వారం ముందు ఓ సినిమాకు ఓ పాట పాడాను. ఇన్నేళ్లుగా పాడుతూనే ఉన్నాను.
(డాక్టర్ భాగ్యలక్ష్మి ఫేస్ బుక్ పోస్టు నుంచి)