‘మేమ్ ఫేమస్’ ఫ్యామిలీ ఎంజాయ్ చేసే యూత్ ఫుల్ ఎంటర్టైనర్: సుమంత్ ప్రభాస్

రైటర్ పద్మభూషణ్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేసిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ దీనికి దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్ర పోషించారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి ఇతర ప్రముఖ తారాగణం. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ప్రామిసింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హై బజ్ ని క్రియేట్ చేసింది మేమ్ ఫేమస్. ఈ చిత్రం ఈనెల 26 న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సుమంత్ ప్రభాస్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

వెల్ కమ్ టు బిగ్ స్క్రీన్ ?
థాంక్స్ అండీ

మేమ్ ఫేమస్ కాన్సెప్ట్, స్ఫూర్తి గురించి చెప్పండి ?
సినిమాల్లోకి రావాలనే ఉద్దేశం మొదట్లో లేదు. కాలేజీలో అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఒక షార్ట్ ఫిల్మ్ తీశాం. అది నచ్చి ఒక ఫిల్మ్ స్కూల్ వాళ్ళు మాకు కంటెంట్ క్రియేట్ చేయమని కెమెరాలు స్పాన్సర్ చేశారు. పిల్ల పిలగాడు అనే వెబ్ సిరీస్ చేశాం. అప్పుడు కూడా సినిమాల్లోకి రావాలని లేదు. డిగ్రీ పాస్ అయినాక ఎస్ఐ కి ప్రిపేర్ కావాలనేది మా ఇంట్లో వాళ్ళ ఆలోచన. పిల్ల పిలగాడు చాలా మందికి రీచ్ అయ్యింది. ఛాయ్ బిస్కెట్ అనురాగ్, శరత్ అన్న పిలిచి మా గురించి అడిగారు. ఏం కావాలని అనుకుంటున్నారో అడిగారు. ఎస్ఐ అని చెప్పా. ఎస్ఐ అయితే ఏం సాధించాలని అనుకుంటున్నారో మంచి కంటెంట్ క్రియేట్ చేస్తే కూడా దాన్ని సాధించవచ్చు అని చెప్పారు. మళ్ళీ ఒక వెబ్ సిరీస్ చేయాలనేది వారి ఆలోచన. మళ్ళీ వెబ్ సిరీస్ ఎందుకు సినిమానే చేసేద్దామన్నాను(నవ్వుతూ). అయితే మంచి కథ రాయి సినిమాకి కావాల్సింది మేము ఇస్తామని చెప్పారు. కథ రాశాను. కథని ఎలా చెప్పాలో కూడా తెలీదు. దాదాపు ఆరు గంటలు పాటు ప్రతిది వివరించి చెప్పాను. అనురాగ్, శరత్ అన్న కి చాలా నచ్చింది. చాలా క్లారిటీ గా ఉన్నావు నువ్వే డైరెక్ట్ చెయ్ అన్నారు. మొదట ఇందులో రైటర్, డైరెక్టర్ గా సైన్ చేశాను. అయితే ఇందులో నేను చేసిన పాత్ర కోసం చాలా ఆడిషన్స్ చేశాం. కానీ ఎవరూ సరిగ్గా కుదరలేదు. షూట్ కి వెళ్ళే పది రోజులు ముందు ఇందులో నటుడిగా చేరాను. ఇదంతా ఛాయ్ బిస్కెట్ నిర్మాతలు నాపై పెట్టుకున్న నమ్మకం వలనే సాధ్యమైంది. సినిమాని సింక్ సౌండ్ లో షూట్ చేశాం. చాలా నమ్మకంగా వున్నాం.

ఫస్ట్ డే షూట్ కష్టమనిపించిందా ?
మొదటి నుంచి చాలా క్లారిటీగా వున్నాం. సినిమా మొదటే ఆఫీస్ లో ఫోన్ లో షూట్ చేశాను. అదంతా టైం లైన్ మీద వేసి చూసినప్పుడు ఎలా రాబోతుందో ఒక క్లారిటీ వచ్చేసింది. సెట్స్ కి వెళ్ళినప్పుడు పూర్తి కాన్ఫిడెన్స్ గా ఉన్నాం.

మీ మొదటి స్పీచ్ చాలా హైలెట్ అయ్యింది కదా ?
నిజంగా అంతమంది ముందు మీడియా సమక్షంలో ఎలా మాట్లాడాలో నాకు తెలీదు, నా మనసులో వున్నది ఎక్స్ ప్రెస్ చేయడానికి ప్రయత్నించాను. అది మీకు నచ్చడం ఆనందంగా వుంది.

మేమ్ ఫేమస్ టైటిల్ పెట్టడానికి కారణం ?
ఇందులో వున్న కుర్రాళ్ళ ఎనర్జీని తెరపై ట్రాన్స్ లేట్ చేయడానికి ప్రయత్నించారు. వూర్లో ఏం చేసినా ఫోకస్, ఫేమస్ అవ్వాలనే ఆలోచన వున్న కుర్రాళ్ళ కథ ఇది. దానికి తగ్గట్టు మేమ్ ఫేమస్ అని పేరుపెట్టాం. ఇందులో దాదాపుగా కొత్తనటీనటులతో చేశాం. అందరూ బ్రిలియంట్ గా పెర్ఫార్మ్ చేశారు.

తెలంగాణలో చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఫేమస్ అయ్యారు కదా.. వాళ్ళ బయోపిక్ లా వుంటుందా ?
ఇది బయోపిక్ కాదు. కానీ ఏం పని చేసినా ఫేమస్ అవ్వాలనుకునే ఉద్దేశం వున్న వాళ్ళకి ఇది బయోపిక్.

మేమ్ ఫేమస్ ప్రమోషన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కదా.. దాని స్ట్రాటజీ గురించి చెప్పండి ?
అందరం కొత్తవాళ్ళతో చేసిన సినిమా ఇది. ఎన్ని పోస్టర్లు వేసిన రిజిస్టర్ కాదు. ఏదో కొత్తగా భిన్నంగా చేయాలి. దాదాపు నెల రోజులు దీనిపై అలోచించాం. కానీ ఏదీ క్రాక్ కాలేదు. ట్రైలర్ వదిలిన తర్వాత ఏదో ఒకటి క్రాక్ అవుతుందని భావించాం. ట్రైలర్ లో ఇటుక మీద ఇటుక పెడితే .. అనే బ్యాండ్ డైలాగ్ వుంది. అది అనురాగ్ అన్నకి నచ్చింది. అనౌన్స్ మెంట్ అందరికీ వినపడాలంటే ఆ బ్యాండ్ సౌండ్ వుంటే బావుంటుందని అనురాగ్ అన్న చాలా స్మార్ట్ గా అలోచించారు. ఆ బీట్ నుంచి ప్రమోషన్స్ క్రాక్ చేశాం. ప్రతి వీడియో మిలియన్ వ్యూస్ కి రీచ్ అయ్యింది. మే 26న సినిమా వస్తుందని అందరికీ చేరింది. సినిమాపై సూపర్ కాన్ఫిడెన్స్ తో వున్నాం.

మీ కుటుంబ నేపధ్యం ఏమిటి ?
మా ఇంట్లో ఇన్ షర్టు వేసుకొని పనిచేసేవాళ్ళు ఎవరూ లేరు. మా డాడీ 7, మా మమ్మీ 10 చదువుకుంది. డాడీ లోకల్ లో ఫ్రెండ్స్ తో కలసి చిన్నగా రియలెస్టేట్ చేస్తుంటారు. నేను ఎస్ఐ అయితే ఆయనకు హెల్ప్ ఫుల్ గా ఉంటుందని అనుకున్నారు(నవ్వుతూ).

మీ అసలు పేరు సుమంత్ ప్రభాస్ నా ?
నాన్న నా పేరు సుమంత్ రెడ్డి అని పెట్టారు. నేను ప్రభాస్ ఫ్యాన్ ని. చిన్నప్పుడు మనకి ఇష్టమైన హీరో పేరు పక్కన మన పేరు వుంటే బావుంటుందనే ఆలోచన వుండేది. అలా పేస్ బుక్ క్రియేట్ చేసినప్పుడు సుమంత్ ప్రభాస్ అని పెట్టుకున్నా. అదే స్క్రీన్ నేమ్ అయిపొయింది.

మల్లారెడ్డి గారితో మీకు అనుబంధం ఉందా ?
లేదన్న. ఇది యూత్ కోసం రాసిన సినిమా. వాళ్ళకి రీచ్ కావాలి. మల్లారెడ్డి కాలేజీలో వేలమంది యూత్ వున్నారు. వాళ్ళ ఓనర్ స్పీచ్ ఇస్తున్నారంటే టాక్ ఏదోలా సర్క్యులేట్ అవుతుంది. ఆయన్ని పిలిస్తే బావుంటుందని అనుకున్నాం. నిజానికి ఆయన కాంటాక్ట్ కూడా లేదు. వంశీ శేఖర్ అన్న వాళ్ళని సంప్రదించి మల్లారెడ్డి గారిని కలవడం జరిగింది. టీజర్ లాంచ్ గురించి చెప్పాం. ఆయన గొప్ప మనసుతో మమ్మల్ని ఆశీర్వదించారు. ఈవెంట్ సక్సెస్ ఫుల్ అయ్యింది. చాలా మంచి బజ్ వచ్చింది.

మేమ్ ఫేమస్ కి సెన్సార్ బోర్డ్ యూ/ఎ ఇవ్వడానికి కారణం ?
సినిమా బావుంది.. బాగా తీశావ్ అని సెన్సార్ బోర్డ్ సభ్యులు చెప్పారు. కానీ క్లీన్ యూ కావాలంటే ఒక డైలాగ్ ని కట్ చేయమని చెప్పారు( అది తెలంగాణలో వాడే చాలా మామూలు పదం). మాకు అంత నీట్ సినిమా కూడా వద్దు. యూ/ఎ నే వుండనీ అన్నాం. చాలా క్లీన్ ఫిల్మ్ ఇది. ఫ్యామిలీ అంతా కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా మేమ్ ఫేమస్.

మీ తర్వాత సినిమా చాయ్ బిస్కెట్ లో చేస్తారా ?
నేను ఎవరో తెల్వద్. నన్ను పిలిచి సినిమా చేయగలవని చెప్పి కథ రాయించి డైరెక్టర్ ని చేసి, నన్నే హీరోగా పరిచయం చేసి వారికున్న పరిచయాలతో పరిశ్రమలోని ఎంతోమందిని తీసుకొచ్చి నన్ను ఇంత గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నారు. వారితో సినిమా చేయడం నాకు ఇష్టం.

మీ ప్రాధన్యత నటనకా, దర్శకత్వానికా ?
నా మొదటి ప్రాధన్యత రచన, దర్శకత్వానికి వుంటుంది. ఈ సినిమా ద్వారా ఒక మార్కెట్ క్రియేట్ అయితే రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలని వుంది. చిన్నప్పటి నుంచి పాజిటివ్ గా వుండటం అలవాటు. మనం పాజిటివ్ గా వుంటే మనకి అంతా పాజిటివ్ నే జరుగుతుందనే నిజాన్ని బలంగా నమ్ముతాను.