ఫ్యామిలీ ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం ‘బ్రో’: టీజీ విశ్వప్రసాద్

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విలేకర్లతో ముచ్చటించిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్, బ్రో సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

బ్రో ప్రయాణం ఎలా మొదలైంది?
మేమొక మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో త్రివిక్రమ్ గారు ఈ చిత్రాన్ని తమిళ్ లో చూసి తెలుగులో చేస్తే బాగుంటుందని సూచించారు. మా బ్యానర్ లో రూపొందుతోన్న చాలా పెద్ద ప్రాజెక్ట్ లలో ఇదొకటి. పవన్ కళ్యాణ్ గారితో సినిమా అంటే ఎవరైనా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటారు.

మాతృకతో పోలిస్తే బ్రో ఎలా ఉండబోతుంది?
తమిళ చిత్రంతో పోలిస్తే ఇది భారీగా ఉంటుంది. బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. కథలోని ఆత్మ అలాగే ఉంటుంది. కానీ స్క్రీన్ ప్లే పరంగా, కమర్షియల్ ఎలిమెంట్స్ పరంగా కొత్తగా ఉంటుంది. మాతృక చూసిన వారికి కూడా ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుంది. సముద్రఖని గారు తమిళ్ లో సినిమాని చాలా చక్కగా తీశారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి రాకతో సినిమా స్థాయి ఎన్నో రెట్లు పెరిగింది.

సినిమాలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర నిడివి ఎంత ఉంటుంది?
మొదటి ఐదు, పది నిమిషాలు ఉండరంతే. అక్కడి నుంచి సినిమా చివరి వరకు ఉంటారు.

ఇది సందేశాత్మక చిత్రం కదా.. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కి సరిపోతుందా?
ఇది పూర్తి సందేశాత్మక చిత్రం కాదు. కమర్షియల్ ఎలిమెంట్స్, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న చిత్రం. అందరు మెచ్చేలా ఉంటుంది.

ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోల కలిసి సినిమా చేయడం ఎలాంటి ప్రభావం చూపనుంది?
చూసే ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్, సాయి తేజ్ గార్ల నిజ జీవిత అనుబంధం గుర్తుకువస్తుందో లేదో నేను చెప్పలేను కానీ సినిమాలోని వాళ్ళ పాత్రలు మాత్రం ప్రేక్షకులను హత్తుకుంటాయి. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కట్టిపడేస్తాయి.

మార్క్ పాత్రకు ముందుగా వేరే హీరో పేరు పరిశీలించారా?
లేదండి.. ముందునుంచి సాయి ధరమ్ తేజ్ గారినే అనుకున్నాం.

బడ్జెట్ పరిమితి దాటిందా? టికెట్ రేట్లు పెంచే ఆలోచన ఉందా?
అనుకున్న బడ్జెట్ లో మేము సినిమాని పూర్తి చేయగలిగాము. బిజినెస్ పట్ల కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నాము. టికెట్ ధరలు పెంచే ఆలోచన లేదు. టికెట్ ధరలు పెంచాలని మేము రెండు రాష్ట్ర ప్రభుత్వాలని కోరలేదు. ఇప్పుడున్న ధరలతోనే విడుదల చేయాలి అనుకుంటున్నాం.

ఈ సినిమాకి బ్రో అనే టైటిల్ ఎలా వచ్చింది?
సినిమాలో సాయి ధరమ్ తేజ్ గారు పవన్ కళ్యాణ్ గారిని బ్రో అని పిలుస్తుంటారు. అలా ఈ టైటిల్ పెట్టడం జరిగింది.

ప్రమోషనల్ సాంగ్ ఎప్పుడు విడుదల చేస్తున్నారు?
ముందుగా ట్రైలర్ విడుదల చేయాలి అనుకుంటున్నాం. 21 లేదా 22వ తేదీన విడుదల చేస్తాం. 25న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇలా పక్కా ప్రణాళికతో ప్రమోషన్స్ చేయబోతున్నాం.

ప్రీమియర్ షోలు వేసే ఆలోచన ఉందా?
ఇప్పటివరకు అయితే ఆ ఆలోచన లేదు. చిన్న సినిమాలకు తమ కంటెంట్ ని చూపించి ప్రేక్షకులను ఆకర్షించడం కోసం ప్రీమియర్ షోలు వేస్తున్నారనేది నా వ్యక్తిగత అభిప్రాయం. పెద్ద సినిమాలకు ఆ అవసరం ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగానే బుక్ అవుతాయి. అయితే అభిమానుల నుంచి ఒత్తిడి వస్తే చెప్పలేం. అప్పటి పరిస్థితులను బట్టి ప్రీమియర్ షోలపై నిర్ణయం తీసుకుంటున్నాం.

ఈ సినిమా తీసుకోవడానికి ఓవర్సీస్ లో బయ్యర్లు రాలేదని ప్రచారం జరిగింది?
పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు బయ్యర్లు రాలేదనే మాటే ఉండదు. ఇప్పటికిప్పుడు హక్కులు ఇస్తామన్నా తీసుకోవడానికి ఎందరో పోటీ పడతారు. ఈ సినిమా మీదున్న నమ్మకంతో మేం సొంతంగా విడుదల చేయాలని ఓవర్సీస్ హక్కులను ఎవరికీ ఇవ్వలేదు.

ప్రభాస్ లాంటి స్టార్ తో సినిమా చేస్తున్నప్పటికీ ఇంతవరకు అధికారికంగా ప్రకటించపోవడానికి కారణం?
ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పాను. ప్రతి సినిమాకి ఒక స్ట్రాటజీ ఉంటుంది. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాము.

పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు ఇద్దరితో ప్రయాణం చేస్తున్నారు కదా.. ఇద్దరి మధ్య ఏమైనా పోలికలు ఉన్నాయా?
రెండు ప్రయాణాలు దేనికదే ప్రత్యేకం. పవన్ కళ్యాణ్ గారితో సినిమాల్లోకి రాకముందు నుంచే అనుబంధముంది. ప్రభాస్ గారితో మాత్రం సినిమాల్లోకి వచ్చాక అనుబంధం ఏర్పడింది. ఇద్దరూ ఎవరికివారు ప్రత్యేకం. ఒకరితో ఒకరిని పోల్చలేం.

రాజకీయ ప్రభావం ఈ సినిమాపై పడే అవకాశముందా?
సినిమాలు వేరు, రాజకీయం వేరు. ఒక్కసారి ఏదో జరిగిందని మళ్ళీ మళ్ళీ అలాగే జరుగుతుంది అని నేను అనుకోవడంలేదు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా మేము పరిష్కరించుకోగలమనే నమ్మకం ఉంది.

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా?
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అసలు లేదండి.

మీరు పని చేయాలనుకుంటున్న డ్రీం హీరో ఎవరు?
అందరి హీరోలతో సినిమాలు చేయాలని ఉంది. ఆ దిశగానే అడుగులు సాగుతున్నాయి. నా డ్రీం హీరో మాత్రం చిరంజీవి గారు. చిన్నప్పటి నుంచి నేను ఆయనకు వీరాభిమానిని. ఆయనతో సినిమా చేయడం నాకు ప్రత్యేకంగా ఉంటుంది.

మీ భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉన్నాయి?
వేగంగా వంద సినిమాలు నిర్మించాలనేది మా లక్ష్యం. బ్రో అనేది మా 25వ సినియా. త్వరలోనే 50 మార్క్ ని అందుకొని, వంద మార్క్ దిశగా అడుగులు వేస్తాం. ప్రస్తుతం 15-20 సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. కొన్ని చర్చల దశలో ఉన్నాయి. అలాగే ఓటీటీ సినిమాలు కూడా చేయబోతున్నాం. బాలీవుడ్ లోనూ సినిమాలు చేసే ఆలోచనలు ఉన్నాయి. త్వరలోనే ముంబైలో ఆఫీస్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నాం.