ఢిల్లీ నుంచి లండన్ పోవాలంటే 8 గంటలు విమానంలో కూర్చుంటే చాలు.. దానికి బస్సు ఎందుకు.. అంటారా? నో..నో.. ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ వెళ్లే వాళ్ల కోసం మొట్టమొదటిసారి ఢిల్లీ నుంచి లండన్ కు బస్సు సౌకర్యాన్ని కల్పించారు. ఢిల్లీ టు లండన్ బస్సు సర్వీస్ లో ఎన్నో విశేషాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం పదండి..
చాలామందికి బస్సుల్లో ప్రయాణిస్తూ ప్రకృతిని ఆస్వాదించడం అలవాటు. అటువంటి వాళ్ల కోసమే సరికొత్తగా ఢిల్లీ నుంచి లండన్ కు బస్సు సర్వీసును ప్రారంభించింది ఓ ట్రావెల్ ఏజెన్సీ. ఢిల్లీ నుంచి లండన్ వెళ్లాలంటే మాటలా. ఇది అత్యంత సుదూరమైన బస్సు యాత్ర కాబోతున్నది. ఢిల్లీ నుంచి లండన్ చేరుకోవడానికి బస్సులో కనీసం 70 రోజుల సమయం పడుతుంది. మొత్తం 18 దేశాలను దాటుకొని బస్సు లండన్ చేరుకుంటుంది.
ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ కు చెందిన అడ్వెంచర్స్ ఓవర్ ల్యాండ్ అనే ట్రావెల్ ఏజెన్సీ ఈ సాహస యాత్రకు ఒడికట్టింది. అయితే.. ఇది ఒక సాహస యాత్ర అని కూడా అభివర్ణించవచ్చు. అయితే.. ఈ యాత్ర ఇప్పుడు కాదు.. వచ్చే సంవత్సరం ప్రారంభం కానుంది.
ఢిల్లీ నుంచి లండన్ వెళ్లడానికి కావాల్సిన అన్ని సదుపాయాలను కంపెనీ ఏర్పాటు చేస్తోంది. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా సిద్ధమయింది. ఇండియాలో ఢిల్లీలో ఈ ప్రయాణం మొదలవుతుంది. అక్కడి నుంచి మయన్మార్, థాయిలాండ్, లావోస్, చైనా, కజకిస్థాన్, ఉజ్బెకిస్తాన్, రష్యా, లిథువేనియా, లాత్వియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ మీదుగా ఈ బస్సు ఇంగ్లండ్ లోని లండన్ కు చేరుకుంటుంది.
ఇక.. ఈ ట్రిప్ కోసం ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. అయితే ఈ బస్సులో కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ బస్సు జర్నీ కోసం బుక్ చేద్దామని ప్రిపేర్ అవుతున్నారా? ఆగండాగండి.. ఈ బస్సు జర్నీలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు 15 లక్షల రూపాయలు చెల్లించాలి.
కళ్లు బైర్లుకమ్మాయా? అవును.. అక్షరాలా 15 లక్షలు చెల్లిస్తేనే మీ సీటు బుక్ అవుతుంది. మిగితా సదుపాయాలన్నీ వాళ్లే చూసుకుంటారు. ఫుడ్డు కూడా వాళ్లే అరేంజ్ చేస్తారు. మొత్తం శాకాహారమే ఉంటుంది. ఏ దేశం వెళ్తే.. ఆ దేశంలో దొరికే ఫుడ్డును అందిస్తారు. ఇక.. ఎక్కడైనా స్టే చేసినప్పుడు అక్కడ ఉన్న హోటళ్లలో బస ఏర్పాటు చేసైతారు. ఫుడ్డు, బెడ్డు, వీసా తదితర ఖర్చులన్నీ ట్రావెల్ ఏజెన్సీనే భరిస్తుంది. ఇక..ఈ బస్సుతో పాటు ఓ గైడ్ కూడా ఉంటాడు. ఆ గైడ్ ఆ ప్రాంత విశేషాలను వివరిస్తాడు.