మంప్స్‌ లేదా గవద బిల్లల వ్యాధి అంటే ఏమిటి? లక్షణాలు, నివారణ మార్గాలు!

సాధారణంగా చిన్నపిల్లల్లో మరియు యుక్త వయస్సు వారిలో ఎక్కువగా కనిపించే గవద బిల్లల వ్యాధి మెడ కింద చెంప భాగంలో వాపు వచ్చి తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పెడుతుంది. ఈ వ్యాధి తీవ్రత వల్ల
జ్వరం, తలనొప్పి, చెవినొప్పి మొదలవుతాయి. నోరు పూర్తిగా తెరిచి ఆహారం మింగడం కష్టం అవుతుంది. కొందరిలో తీవ్రమైన వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి కూడా సంభవిస్తుంది. అసలు గవద బిల్లల వ్యాధి అంటే ఏమిటి వ్యాధి లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గవద బిల్లల వ్యాధి దీన్నే మంప్స్‌ లేదా చంప గడ్డల వ్యాధి అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి మిక్సో వైరస్‌ పరోటెడిస్‌ అనే వైరస్‌ వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు లాలాజలా తుంపర్ల ద్వారా మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకితే చెవి ముందు, కింద, దవడ భాగం వరకు విస్తరించి ఉన్న పరోటిడ్‌ లాలాజల గ్రంథి వాచిపోయి తీవ్ర నొప్పిగా అనిపిస్తుంది.మిక్సో వైరస్‌ శరీరంలో ప్రవేశించిన రెండు లేదా మూడు వారాలకు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి లక్షణాలను పరిశీలించినట్లయితే తీవ్రమైన జ్వరం లక్షణాలతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

మిక్సో వైరస్‌ సోకిన పదిమందిలో ఒకరికి మెదడువాపు రావచ్చు. నలుగురిలో ఒకరికి వృషణాలు వాచి నొప్పిగానూ ఉంటుంది. యుక్త వయసులో మంప్స్‌ వ్యాధి బారిన పడితే కొందరిలో వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల భవిష్యత్తులో పిల్లలు పుట్టకపోవచ్చు. ఇరవై వేలమందిలో ఒకరికి చెముడు కూడా వస్తుంది. పదివేలమందిలో అరుదుగా ఒకరికి మరణం సంభవించవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గవద బిల్లల వ్యాధి నుంచి రక్షణ పొందాలంటే చిన్నపిల్లలకు
ఎంఎంఆర్‌ టీకాలను తప్పనిసరిగా ఇప్పించాల్సి ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులోవ్యాధి తీవ్రత నుంచి రక్షణ పొందుతారు. శారీరక శుభ్రతను పాటించడంతోపాటు రోజువారి ఆహారంలో విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ యాంటీ మైక్రోబియన్ గుణాలు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకుంటే మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది.