చలికాలంలో పెదాల ఆరోగ్యంపై దృష్టి పెట్టకుంటే ఈ సమస్యలు తలెత్తవచ్చు….జాగ్రత్త!

ప్రస్తుతం శీతాకాలం సీజన్ నడుస్తోంది వాతావరణంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతోపాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిల్లో చర్మం పొడి వారడం, పెదాలు పొడి వారడం, చీలడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ సమస్య తీవ్రమైన నొప్పి, ఒక్కోసారి రక్తస్రావం కూడా కలుగుతుంది. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా సున్నితమైన పెదాల విషయంలో ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే పెదవుల ఆరోగ్యాన్ని మరియు చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు.

చలికాలంలో పెదాలు పొడిబారడం సాధారణమే అయినప్పటికీ వీటి విషయంలో ఆజాగ్రత్త పాటిస్తే చర్మ అలర్జీలు తలెత్తి పెదవులు వాటి సహజ సౌందర్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.మన ఇంట్లో సహజ సిద్ధంగా లభించే వెన్న, ఆలివ్ ఆయిల్‌ని, కొబ్బరి నూనె వంటి వాటితో పెదవులను మసాజ్ చేసుకోవడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ సరిగా జరిగి పెదవులు పొడిబారడం తగ్గుతుంది. అలాకాకుండా మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉపయోగిస్తే దీర్ఘకాలంలో చర్మ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

శీతాకాలంలో విటమిన్ సి విటమిన్ ఏ సహజ యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభించే క్యారెట్, యాపిల్, దోస, పుచ్చకాయ, కొబ్బరినీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంలో తేమ శాతం అధికంగా ఉండి చర్మం పొడిబారడాన్ని నివారిస్తుంది. అలాగే పెదాల సమస్యలు కూడా తొలగిపోతాయి.అందమైన గులాబీ రంగు పెదాల కోసం బాదం నూనెలో తేనె, చిటికెడు చక్కెర కలిపిన మిశ్రమాన్ని పెదాలపై సున్నితంగా మర్దన చేసుకుంటే పెదాలపై ఉండే మృత చర్మాన్ని తొలగించి పెదాలకు తేమను అందిస్తుంది

కలబంద గుజ్జును ప్రతిరోజు సున్నితమైన పెదవులకు మర్దన చేసుకుంటే పెదవులు తేమగా మృదువుగా తయారవుతాయి.గులాబీ రేకులను పాలలో నానబెట్టి మెత్తగా నూరి పెదాలపై సున్నితంగా మసాజ్ చేయాలి. రాత్రి సమయాల్లో పడుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ పసుపులో తగినంత నెయ్యి వేసి ఆ మిశ్రమాన్ని పొడిబారిన పెదాలపై మర్దన చేసుకుంటే పెదవులపై ఏర్పడిన మచ్చలు, పగిలిన గాయాలు తొందరగా మానిపోతాయి.