ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నారా…. పేగు ఇన్ఫెక్షన్లు తప్పవంటున్న నిపుణులు!

ఈ రోజుల్లో చిన్నపాటి అనారోగ్య సమస్య తలెత్తితే చాలు ఎలాంటి వైద్య సలహాలు తీసుకోకుండా విచ్చలవిడిగా యాంటీబయాటిక్ మందులను వాడడం సర్వసాధారణంగా మారుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యాధి కారకాలను నియంత్రించడంలో యాంటీబయాటిక్ మందులు పనిచేయకపోగా తీవ్రమైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పేగుల్లో ఇన్ఫెక్షన్ సమస్య తలెత్తినప్పుడు వాడే యాంటీబయాటిక్ మందుల వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుందేమో కానీ భవిష్యత్తులో పేగు పూత (ఐబీడీ) ముప్పు మరింత పెరిగే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రముఖ ఆరోగ్య సంస్థలు నిర్వహించిన సర్వే ప్రకారం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది పేగుల్లో ఇన్ఫెక్షన్ (ఐబీడీ)తో బాధపడుతున్నారని అంచనా.వచ్చే దశాబ్దంలో వీరి సంఖ్య మరింత పెరుగుతుందనీ భావిస్తున్నారు. ఐబీడీలో క్రోన్స్‌ డిసీజ్‌, అల్సరేటివ్‌ కొలైటిస్‌ అని రెండు సమస్యలు తలెత్తుతుంటాయి. సాధారణంగా
పేగుల్లో ఇన్ఫెక్షన్ సమస్య తలెత్తినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ నియంత్రించడానికి ఇచ్చే నైట్రోఇమిడజోల్స్‌, ఫ్లూరోక్వినలోన్స్‌ రకం మందులతో ఎక్కువ ముప్పు పొంచి ఉంటున్నట్టూ పరిశీలనలో వెల్లడైందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఈ యాంటీబయోటిక్ మందులు పేగుల్లో ఇన్ఫెక్షన్ కు కారణమైన హానికారక బ్యాక్టీరియానే కాదు, మన ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియానూ కూడా నశింపజేస్తుంది. ఫలితంగా తీవ్రమైన పేగు అల్సర్లు, పేగు పూత (ఐబీడీ) వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చిన్న వయసులోనే విచ్చలవిడిగా యాంటీబయాటిక్ మందులు వాడడం వల్ల పేగుల్లో ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువై పేగు పూత (ఐబీడీ) సమస్య తలెత్తుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడివారిలో దీని ముప్పు ఇంకాస్త అధికంగా ఉంటున్నట్టు పరిశోధన ఫలితాలు చెబుతున్నాయి.