కోర్టుకెక్కిన ..ప్రభాస్‌ ‘గెస్ట్ హౌస్’ విలువెంతో తెలుసా?

హైదరాబాద్‌ శివారు ప్రాంతం రాయదుర్గం సమీపంలో ‘పైగా’ భూముల్లోని నిర్మాణాలను రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. ఆ ప్రాంతంలో ఉన్న సినీహీరో ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ను సీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్‌ గెస్ట్ హౌస్ వద్ద ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గేటుకు నోటీసు అంటించి సీజ్‌ చేశారు.

ప్రభుత్వ స్థలమని పేర్కొనే సూచికలను ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపధ్యంలో ఈ విషయం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ గెస్ట్ హౌస్ ఎంత విలువ చేస్తుంది…అసలు ఆ గెస్ట్ హౌస్ విషయమేమిటని ఫిల్మ్ నగర్ జనాలు ఆరా తీయటం మొదలెట్టారు.

అందుతున్న సమాచారం ప్రకారం..మిగతా అందరి హీరోల్లాగే..ప్రభాస్ కూడా హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో తన ఫ్రెండ్స్ తో అప్పుడప్పుడూ సరదాగా కాలక్షేపం చేయటానికిగానూ ఓ గెస్ట్ హౌస్ ఉండాలని అనుకున్నారు. అప్పుడు తనకు తెలిసి ఉన్న ఓ ప్రెవేట్ రియల్ ఎస్టేట్ డీలర్ ద్వారా ఈ స్దలం తీసుకున్నారు. అయితే అది ఇల్లీగల్ స్దలమని తెలియదు. 2200 యార్డ్ ల స్దలం ఆయన మంచి రేటు పెట్టి తీసుకున్నారు. ప్రభాస్ మాత్రమే కాదు..మరికొంతమంది హై ప్రొఫైల్ వ్యక్తులు అక్కడ స్దలాలు తీసుకున్నారు. అక్కడ స్దలం విలువ కాకుండా కోటి రూపాయల పెట్టి గెస్ట్ హౌస్ నిర్మించినట్లు సమాచారం.

రాయదుర్గంలోని ‘పైగా’ భూములపై కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. ఆ భూములు ప్రభుత్వానివేనని ఇటీవల సుప్రీంకోర్టు తేల్చింది. దీంతో అక్కడి కట్టడాలను ఇటీవల రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అక్కడే ఉన్న ప్రభాస్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. అధికారులు దాన్ని సీజ్ చేశారు. అయితే అధికారుల చర్యలను సవాల్ చేస్తూ ప్రభాస్ హైకోర్టులో దాఖలు చేసారు.