నమ్మకం కోసమే పవన్ షిప్టింగ్ నిర్ణయం..?

2009 ఎన్నికల్లో చిరంజీవి పాలకొల్లు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి బంగారు ఉషారాణి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. మళ్లీ పదేళ్ల అనంతరం చిరంజీవి తమ్ముడు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ భీమవరం నుంచి గెలుస్తాడని అనుకున్నారు. అలాగే నర్సాపురం ఎంపీగా నాగబాబు గెలుస్తాడని కూడా భావించారు. ఏదీ జరగలేదు. పవన్ తను నిలబడ్డ రెండు చోట్లా ఓడిపోవటం అభిమానులకు మింగుడుపడటం లేదు.

అప్పట్లో పవన్‌కళ్యాణ్‌ గాజువాకలోనే వుంటా అనే నమ్మకం కలిగించడం కోసం అక్కడో ఇల్లు అద్దెకి తీసుకున్నారు. భీమవరంలో గెలిస్తే అక్కడా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటానని పవన్‌ కళ్యాణ్‌ అక్కడి ప్రజలకి హామీ ఇచ్చాడు. రెండు చోట్లా గెలవని పవన్‌కళ్యాణ్‌ భీమవరంలోనే మళ్లీ పోటీ చేయడానికి సుముఖంగా వున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. భీమవరంలో ఓడినా కానీ ఇక్కడ సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుని స్థానికుడి అనిపించుకోవాలని పవన్‌ భావిస్తున్నాడట.

స్వస్థలంగా చెప్పుకుంటున్నా ఎప్పుడూ అటుకేసి వెళ్లడం కానీ, ఆ ఊరికి ఏదైనా చేయడం కానీ చేయలేదని ఈ అన్నదమ్ముల ముగ్గురిపై ఆరోపణలు స్థానికంగా ఉన్నాయి. అక్కడ ఫ్యాన్స్ బాగానే వున్నా వ్యతిరేకత కూడా ఎక్కువ వుండడంతో పాటు, మరీ ముఖ్యంగా స్థానికులు కాదనే వాదన ఎక్కువగా వినిపించడంతో దానిని కౌంటర్‌ చేయడానికి భీమవరంలో స్థిర చిరునామా ఏర్పరచుకోవడంతో పాటు తన ఐడెంటిటీ కార్డులు, ఓటర్‌ కార్డు కూడా అటు షిఫ్ట్‌ చేయాలని పవన్‌ భావిస్తున్నాడట. అయితే ఇందులో నిజమెంత అనేది జనసేనాని వేసే నెక్ట్స్ స్టెప్ ని బట్టి తెలుస్తుంది.