`యన్.టి.ఆర్ మహానాయకుడు`కి ఏదో రకంగా సమస్యలు వస్తూనే ఉన్నాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని `యన్.టి.ఆర్ మహానాయకుడు`గా ప్రజల ముందుకు తీసుకొచ్చారు బాలకృష్ణ, క్రిష్. సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ప్లాప్ అయ్యింది. ఫుల్ రన్‌లో ఐదు కోట్ల రూపాయలు రావడమే కష్టమైంది. `మహానాయకుడు` కంటే `కథానాయకుడు` బెటర్ అని అంటున్నారు కూడా.
సరేలే! కామ్‌గా ఉంటే సరిపోయిదిగా.. కానీ తెలుగు దేశం పార్టీ వర్గాలు చేసిన పని ఇప్పుడు `మహానాయకుడు`తో పాటు తెలుగుదేశం పార్టీకి కూడా సమస్యలు తెచ్చిపెట్టేలానే ఉన్నాయి.
అసలు విషయమేమంటే.. సినిమా పరిస్థితి మరి దిగజారకుండా పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నాయకులను చర్యలు తీసుకోమని సూచించాడు. అలాగే పార్టీ కార్యకర్తలకు సినిమాను చూపించమంటూ అదేశించాడు. ఈ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా చూడాల్సింది పోయి.. బాహాటం చేసి రచ్చ పెట్టారు. కృష్ణాజిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు బచ్చయ్య అర్జునుడు ` సినిమా టికెట్స్‌లో 50 శాతాన్ని పార్టీ భరిస్తుందని, ఇది కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం చేస్తున్నాం` అంటూ ఓ లేఖ రాశాడు. ఆ లేఖ ఇప్పుడు బయటకు వచ్చింది. దీంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన సినిమా, పార్టీల పరిస్థితి తయారైంది. మరి దీనిపై ఇప్పుడు తెలుగు దేశం వర్గాలు ఏమని వివరణ ఇచ్చుకుంటాయో చూడాలి.
-మోహన్