పైకి ఎంత నవ్వుతూ నవ్విస్తూ కనిపించినా లోన ఎన్నో కలతలు. చాప్లిన్ జీవితం అది. తనలోని అంతర్మథనాన్ని.. కలతల్ని కప్పి పుచ్చుకునేందుకే అతడు హాస్యాన్ని ఆశ్రయించాడు. తన అభిమాన ప్రేక్షకుల మోములో నవ్వును ఎప్పుడూ చెరగనివ్వలేదు. కానీ ఆ నవ్వు ఎందరికో ఆరోగ్యాల్ని ప్రసాదించింది. కానీ తన కలతల్ని మాత్రం అది తొలగించలేదు. చాప్లిన్ ఎండింగ్ గురించి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఎందరో కమెడియన్ల సన్నివేశం అంతే ఎమోషనల్ గా ఉంటుంది. నిత్యం నవ్వులు కురిపిస్తూ తెలుగు సినిమా హాస్య నటులు థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించి వినోదాన్ని పంచారు. కానీ వారి జీవితాల్లో వున్న చీకటి నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. దశాబ్దాల కాలంగా తెలుగు సినిమా హాస్యనటులు తమదైన హాస్యంతో అభిమానులకు ఆనందం పంచి తాము మాత్రం మదనానికి గురయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్ని పరిశ్రమలు ఉన్నా మనకు ఉన్నంత మంది హాస్య నటులు ఇంకెక్కడా ఉండరు. దేశంలోనూ మిగతా భాషలతో పోలిస్తే మన తెలుగులోనే హాస్యనటులు ఎక్కువ. మన సినిమాల్లో హాస్యం పాళ్లు కూడా ఎక్కువే. అయితే అలా వెండితెరని గిలిగింతలు పెట్టి నవ్వించి నవ్వుల రారాజులు ఒక్కొక్కరుగా అమర పురికి తరలిపోవడం తెలుగు సినీ లోకాన్నే కాదు యావత్ తెలుగు ప్రేక్షకుల్ని విస్మయానికి గురిచేస్తోంది. ధర్మవరపు సుబ్రహ్మణ్యం నుంచి నిన్నటి వేణుమాధవ్ వరకు చాలా మంది చిన్న వయసులోనే పరమపదించడం పలువురిని ఆందోళనకు గురి చేస్తోంది. వంశీ చిత్రాల ద్వారా లేటు వయసులో కామెడీయన్‌గా తెరంగేట్రం చేసి కొండవలస తీవ్ర అనారోగ్యానికి గురై మరణించారు. ఎప్పుడూ తెరపై తనదైన మార్కు హాస్యాన్ని పండించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం క్యాన్సర్ కారణంగా మరణించడం, విలన్ పాత్రలతో పాటు కామెడియన్‌గా కూడా ఆకట్టుకున్న ఆహుతి ప్రసాద్ ని కూడా క్యాన్సర్ మహమ్మారి మింగేయడం ఎవరికీ అంతుపట్టలేదు.
లేడీస్ టైలర్ చూసిన వాళ్లకి గుర్తొచ్చే పేరు బట్టల సత్యం. ఆ పాత్రలో జీవించి తనదైన మార్కు హాస్యంతో దశాబ్దాల పాటు తెలుగు సినీ ప్రేక్షకుల్ని నవ్వించిన మల్లిఖార్జునరావు హార్ట్ ఎటాక్‌తో ఆకస్మాత్తుగా చని పోవడం చిత్రమే. సంక్రాంతి కోడిపందాలకు వెళ్లి అస్వస్థతకు గురైన ఎమ్మెస్ నారాయణ ఆ తరువాత మరణించడం అన్నది ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. లివర్ పెయిల్ అయి ఏవీఎస్, తీవ్ర ఆనారోగ్యానికి గురై గుండు హనుమంతరావు, మందుకు బానిసై లక్ష్మీపతి, చివరికి లివర్ ఫెయిల్ కావడంతో వేణుమాధవ్ …ఇలా గడిచిన పదేళ్లలో తెలుగు సినిమాలో నవ్వులు విరజిమ్మిన మేటి కమేడియన్స్ అంతా కాలగర్భంలో కలిసిపోవడం తీరని లోటే. ఆ లోటుని ఎవరూ భర్తీ చేయలేనిది.
