“ఆర్ ఆర్ ఆర్” లో అది అదిరిపోయే ట్విస్ట్? విమర్శించే మిస్టేకా?!
“ఆర్ ఆర్ ఆర్” చిత్రం టీమ్ ..ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఓ ఇంట్రస్టింగ్ ట్వీట్ పెట్టి అందరిని ఎట్రాక్ట్ చేయటం జరిగింది. “మా కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు అనుకోకుండా కలిసి విడిపోలేనంత అనుభందం కలిగిన మిత్రులు అయ్యారు. అలాగే మీ జీవితంలో కూడా ఇలానే హఠాత్తుగా కలిసి ఆతరువాత బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిన వారుంటారు. అలాంటి మీ బెస్ట్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోని ఆర్ ఆర్ ఆర్ యెహ్ దోస్తీ యాష్ ట్యాగ్ తో మాకు పంపి విషెస్ చెప్పండి” అని ఓ పోస్ట్ పెట్టారు.
ఈ పోస్టుకి మంచి రెస్పాన్స్ రావడంతో దేశవ్యాప్తంగా లక్షల మంది తమ ప్రాణ స్నేహితులతో దిగిన ఫోటోలు పంపి తన స్నేహ భావాన్ని చాటుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే అక్కడే ఈ చిత్రం కథపై లీక్ ఇచ్చినట్లైంది. దాంతో కొందరు ఇదొక కొత్త ట్విస్ట్ అని పొగుడుతూంటే, మరికొంతమంది ఇదే పెద్ద మిస్టేక్ అని దుయ్యపడుతున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ చేసిన ట్వీట్ ను బట్టి కొమురంభీం సీతారామారాజు ఫ్రెండ్ షిప్ గనుక నిజమైతే అంతకంటే పెద్ద తప్పు మరొకటి ఉండదు అని తేలుస్తున్నారు.
ఇంతకీ వాళ్లుతప్పు పట్టేది ఏమిటంటే.. అల్లురి సీతారామరాజు..ఉత్తరాంధ్ర మన్యం వీరుడు. అక్కడ గిరిజనుల హక్కుల కోసం బ్రిటీష్ వారితో పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు. ఇక కొమురం భీం.. అడవుల జిల్లా ఆదిలాబాద్ లో గిరిజనుల కోసం తుపాకీ పట్టి నిజాం ప్రభువులను ఎదురించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన గిరిజన యోధుడు. చరిత్రలో ఈ ఇద్దరు రెండు ప్రాంతాల విముక్తి కోసం పోరాడారు.. ప్రాణత్యాగం చేశారు.
కానీ ఇద్దరు కలిసింది లేదు.. కలిసి పోరాడింది లేదు. కానీ ఒకే కాలంలో ఈ ఇద్దరు వారి వారి ప్రజల కోసం పాటుపడ్డారు. కానీ రాజమౌళి ఈ ఇద్దరి కథను తీసుకొని సినిమాటిక్ స్టైల్లో స్నేహితులుగా చూపించబోతున్నాడా? అదే జరిగితే మాత్రం అదో పెద్ద మిస్టేక్ అని అంటున్నారు. అస్సలు ఒకరికి ఒకరు సంబంధం లేని ఇద్దరు పోరాట యోధులను ‘ఫ్రెండ్ షిప్’ డే సందర్భంగా కలపడం పెద్ద తప్పుగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మరో ప్రక్క అల్లూరి సీతారామరాజు, కొమరం భీం సమకాలీకులు కాకపోయినప్పటికీ , ఎక్కడా ఇద్దరూ కలిసి పోరాటం చేయనప్పటికీ సినిమా సౌలభ్యంతో ఈ ఇద్దరినీ కలుపుతున్నాడు జక్కన్న అని చెప్తున్నారు. ఇద్దరు అసమాన యోధులు కలిస్తే బ్రిటిష్, నైజాం నవాబ్ లపై యుద్ధం చేస్తే ఆ యుద్ధం ఎలా ఉంటుంది అన్నదే ఆర్ ఆర్ ఆర్ చిత్ర కథ . ఎలా కలిపాడు అనేదే ఈ సినిమాలో ట్విస్ట్ .
ఏదైమైనా బాహుబలి2 చిత్రానికి ” కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు” అనే ఒక్క క్వశ్చన్ తో కావలసినంత ప్రచారం రాబట్టాడు. మరి “ఆర్ ఆర్ ఆర్” కూడా భారీ బడ్జెట్ చిత్రం కావడంతో ఇప్పటినుండే మూవీకి హైప్ క్రియేట్ చేసే పనిలో పడ్డారనిపిస్తుంది. వచ్చే ఏడాది జులై 30న ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది.