దిల్ రాజు ని నమ్మి దెబ్బైయిపోయిన శర్వానంద్ !

వెచ్చటి జ్ఞాపకాలు, తియ్యటి అనుభూతులు, కన్నీటిని నియంత్రించలేని భావోద్వేగాల సమాహారంగా టాలీవుడ్‌లో గతంలోనూ గొప్ప కథలే వచ్చాయి. అలాంటి వాటిలో చాలా సినిమాలే ఓకే  అనిపించుకున్నా.. కలెక్షన్లపరంగా  అంచనాలకు చేరనివే ఎక్కువ. వసూళ్లపరంగా ‘జాను’ సైతం అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. తెలుగు ఆడియన్స్‌ని క్లాసిక్స్‌తో థియేటర్లకు రప్పించటం అంత సులువుకాదన్న విషయం ‘జాను’తో రిపీటైంది.  
 
తనకున్న కొద్దిపాటి జ్ఞానంతో మనసు వద్దని వారించినా..  దిల్‌ రాజు మీద ప్రగాఢమైన నమ్మకంతో ప్రాజెక్టు చేసిన శర్వానంద్‌లో.. ఈ అనుభవం ఎలాంటి మార్పులకు ‘శ్రీకారం’ చుడుతుందో చూడాలి. తన కెరీర్‌లో కొన్ని మైలురాళ్లవంటి సినిమాల జాబితాలో ‘జాను’ కూడా ఉంటుందని శర్వా సంతృప్తి వ్యక్తం చేస్తున్నా అతని ఖాతాలో ఇదొక పరాజయంగానే చూడక తప్పదు. కథల ఎంపిక విషయంలో శర్వా ఆచితూచి అడుగేస్తాడన్నది ఇండస్ట్రీ మాట. పైగా వేగంగా సినిమాలు చేసేయాలన్న ఆత్రత ఏమాత్రం చూపించడనటంలో సందేహం లేదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా  కెరీర్‌ని అమాంతం పైకిలేపే సినిమా ఒక్కటీ పడటం లేదు. ఇంతకుముందు చేసిన పడిపడి లేచె మనసు, రణరంగం సినిమాలు సైతం శర్వాను నిరాశపర్చాయి. రణరంగం సినిమా నిరాశపర్చినా  క్లాసిక్స్ పెర్ఫార్మర్ అన్న ముద్రనుంచి కాస్త బయటికొచ్చే అవకాశమిచ్చింది. తాజాగా ‘జాను’  శర్వాను మళ్లీ అదే ట్రాక్‌లో కూర్చోబెట్టింది.
 
శర్వానుంచి రానున్న తాజా ప్రాజెక్టు ‘శ్రీకారం’. రైతు కొడుకు రైతే ఎందుకవ్వాలి? అన్న రొటీన్ నానుడికి భిన్నంగా ‘రైతు కొడుకు రైతే కావాలి’ అన్న ఇంప్రెసివ్ కానె్సప్ట్‌తో వస్తోన్న చిత్రమిది. ఇదీ సోషల్ క్లాసిక్‌గా తెరకెక్కితే  శర్వా ఆ టైప్ ఇమేజ్‌నుంచి బయటపడటం కొంచెం కష్టమే. ఫ్యూచర్ ప్రాజెక్టులతోనైనా  ఈ యంగ్ హీరో ‘ఫేజ్’మార్చుకుని వస్తాడా? క్లాసిక్ పెర్ఫార్మర్ ఇమేజ్‌తోనే కంటిన్యూ అవుతాడా? అన్నది చూడాలి. ఏది ఏమైనా  శర్వా కెరీర్ గురించి ఒకసారి ఆలోచించుకోవాలి అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు!? ప్చ్.. శర్వానంద్!?