టాలీవుడ్ వైజాగ్ వైపు చూస్తుందా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ – తెలంగాణ డివైడ్ ఫ్యాక్ట‌ర్ త‌ర్వాత తొలిగా సినీప్ర‌ముఖుల్లో నెల‌కొన్న సందిగ్ధ‌త‌.. టాలీవుడ్ ఎటు వెళుతుంది? అన్న‌దే. ఆ క్ర‌మంలోనే బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రానికి టాలీవుడ్ త‌ర‌లి వెళుతుంద‌ని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్వ‌యంగా ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌న‌మైంది. మ‌రో టాలీవుడ్ ఏర్ప‌డితే దానికి పూర్తి స‌హ‌కారం అందిస్తామ‌ని ఆయ‌న అన్నారు. అలాగే హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ‌కు అన్నివిధాలా సాయ‌ప‌డ‌తామ‌ని ప్రామిస్ చేశారు. అయితే ఏపీలో రాజ‌ధాని విష‌యంలో స్ప‌ష్ట‌త కొర‌వ‌డ‌డంతో కొత్త టాలీవుడ్ విష‌యం మ‌రుగున ప‌డిపోయింది. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో చంద్ర‌బాబు సినీప‌రిశ్ర‌మ‌ను లైట్ తీస్కోవ‌డంతో అది కాస్తా తెర‌మ‌రుగైంది. 

అయితే అప్ప‌టి స‌న్నివేశం ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. ఏపీ యువ‌ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న విష‌యంలో పూర్తి స్ప‌ష్ట‌త‌తో ముందుకు వెళుతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ముఖ్యంగా విశాఖ‌కు రాజ‌ధానిని త‌ర‌లించ‌డం ద్వారా త‌నదైన మార్క్ చూపిస్తున్నారు. ఇక వైజాగ్ లో రాజ‌ధాని అన‌గానే మ‌రో టాలీవుడ్ ప్ర‌స్థావ‌న అక్క‌డ స్థానిక నాయ‌కుల్లో విస్త్ర‌తంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. మొన్న‌టికి మొన్న ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి అవంతి శ్రీ‌నివాస్ విశాఖ ఉత్స‌వాల్లో వైజాగ్ లో టాలీవుడ్ ని ఏర్పాటు చేసేందుకు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆస‌క్తిగా ఉన్నార‌ని ప్ర‌క‌టించారు. అనంత‌రం గంటా శ్రీ‌నివాస‌రావు వంటి ప్ర‌బుద్ధులు వైజాగ్ క్యాపిట‌ల్ కి .. వైజాగ్ టాలీవుడ్ కి ఆస్కారం ఉంద‌ని ఉత్సాహం చూపించ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇక మొన్న‌టికి మొన్న మా డైరీ 2020 ఆవిష్క‌ర‌ణ‌లో మెగాస్టార్ చిరంజీవి సైతం వైజాగ్ టాలీవుడ్ గురించి ప్ర‌స్థావించారు. ఏపీ ముఖ్య‌మంత్రితో మాట్లాడాన‌ని.. మ‌రో కొత్త ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయ‌ద‌లిస్తే అన్నివిధాలా సాయ‌ప‌డ‌తాన‌ని వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాటిచ్చార‌ని చిరు అన‌డంతో ఇక వైజాగ్ టాలీవుడ్ ఖాయ‌మైన‌ట్టేన‌న్న చ‌ర్చా వేడెక్కిస్తోంది. ఇంతకుముందే మెగాస్టార్ చిరంజీవి త‌న స‌తీమ‌ణితో పాటుగా వెళ్లి జ‌గ‌న్ ని క‌లిసారు. అప్పుడే విశాఖ‌లో కొత్త టాలీవుడ్ ఏర్పాటు గురించి మంత‌నాలు సాగించార‌న్న ప్ర‌చారం సాగింది. మ‌రి ఇది నిజ‌మ‌వుతుందా?  మ‌రో కొత్త టాలీవుడ్ నిర్మాణం మొద‌లైన‌ట్టేనా? అన్న‌దానిపై మ‌రికొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది.