కార్తికేయ కెరీర్‌ సందిగ్ధం లో పడింది!?

మొదటి సినిమాతో యూత్, మాస్ ఆడియన్స్‌కి కనెక్టైన కార్తికేయ.. తరువాత ఎంత వేగంగా సినిమాలు చేస్తున్నాడో అంతే వేగంగా బోల్తాపడుతూ వెనక్కి పోతున్నాయి. టాలీవుడ్ లో అరగేంట్రం చేసిన ‘ఆర్‌ఎక్స్ 100’ తప్ప చెప్పుకోడానికి కార్తికేయ కెరీర్‌లో మరో గొప్ప సినిమా లేకుండా పోయింది. కొద్దిరోజుల క్రితం వచ్చిన 90ఎంఎల్, అంతకుముందు చేసిన హిపీ చిత్రాలైతే కార్తికేయ మార్కెట్‌ని పూర్తిగా వెనక్కి లాగేశాయి కూడా. కెరీర్ క్రైసిస్ నుంచి బయటపడటానికి కార్తికేయ తదుపరి సినిమా సన్నాహాల్లో బిజీ అయ్యాడు. ఆ సినిమా -చావుకబురు చల్లగా. అధికారికంగా టైటిల్ కన్ఫర్మ్‌కాకున్నా దీనిపై ఓ నిర్ణయానికి వచ్చేశారని తెలుస్తోంది. మంచి కథలను ఎంచుకుంటూ వెళ్తున్న బన్నీవాసు ప్రాడెక్టుగా వస్తోన్న ఈ ప్రాజెక్టును కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నాడట. ఈ సినిమాలో ‘బస్తీ బాలరాజు’గా కార్తికేయ కనిపిస్తాడన్నది తాజా సమాచారం. కార్తికేయ సరసన లావణ్య త్రిపాఠి కనిపించనుంది. ఈమధ్యే వచ్చిన అర్జున్ సురవరం హిట్టుతో హమ్మయ్య అనుకున్న లావణ్యకు ఈ ప్రాజెక్టులో చాన్స్ రావడం కలిసొచ్చే కాలమే అనుకోవాలి. కాకపోతే కార్తికేయ లావణ్య కెమిస్ట్రీ ఎంతవరకూ వర్కౌటవుతుందన్నది చూడాలి.