తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి వుంది. సిట్టింగ్ ఎంపీ అకాల మరణంతో ఖాళీ అయిన ఈ లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతందన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే, అప్పుడే రాజకీయంగా చాలా ‘వేడి’ కనిపిస్తోందిక్కడ. అందరికంటే ముందే ఇక్కడ బీజేపీ హంగామా షురూ అయ్యింది. మిత్రపక్షం జనసేన పార్టీ బలపరిచిన బీజేపీ అధ్యర్థి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బంపర్ మెజార్టీతో గెలుస్తారంటూ బీజేపీ రాజకీయ ప్రకటనలు చేసేస్తోంది. అయితే, మొట్టమొదట అభ్యర్థిని ప్రకటించింది మాత్రం తెలుగుదేశం పార్టీనే. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, టీడీపీ తరఫున తిరుపతి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. అయితే, ఆమె ఇంకా ఎన్నికల ప్రచారం ప్రారంభించలేదు. స్థానికంగా టీడీపీ నేతలు మాత్రం తమ పని తాము ప్రారంభించేశాయి.
ఇక, సిట్టింగ్ ఎంపీ తమ పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ, ఆ సిట్టింగ్ ఎంపీ కుటుంబానికి సీటు కేటాయించలేదు వైసీపీ. సిట్టింగ్ ఎంపీ కుమారుడికి మాత్రం ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చి, ‘కామప్’ చేసేసింది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. పాదయాత్రలో తనకు సహకరించిన డాక్టర్ గురుమూర్తిని తిరుపతి లోక్‌సభ నుంచి పోటీ చేయించాలని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భావిస్తున్నారట. అయితే, అధికారికంగా ఇప్పటిదాకా వైసీపీ, తమ అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ, తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి వైసీపీ కార్యాచరణ షురూ అయ్యిందంటూ వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన వైవీ సుబ్బారెడ్డి ప్రకటించేశారు. ఆయన, వైసీపీ తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశమయ్యారు తాజాగా. ఇక్కడ వైసీపీకి గెలుపుపై పెద్దగా అనుమానాల్లేవు. సిట్టింగ్ ఎంపీ అకాల మరణం..
అనే సెంటిమెంట్ వైసీపీకి కలిసొస్తుంది. అయితే, మెజార్టీ ఎంత సాధిస్తాం.? అన్నదానిపై వైసీపీ వ్యూహరచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. రికార్డు మెజార్టీతో గనుక తిరుపతి ఎంపీ సీటుని మళ్ళీ కైవసం చేసుకుంటే, రాష్ట్రంలో మొత్తంగా విపక్షాలన్నిటికీ చావు దెబ్బ తగిలినట్లవుతుందన్నది వైసీపీ వ్యూహం. కానీ, వైసీపీకి, తిరుపతి ఉప ఎన్నిక అంత తేలికైన వ్యవహారం కాదు. రాజకీయాల్లో ఈక్వేషన్స్ నిన్న ఒకలా, నేడు ఇంకొకలా వుండొచ్చు. ఆ విషయం వైసీపీ అధిష్టానానికీ బాగా తెలుసు. అందుకే, యుద్ధ ప్రాతిపదికన.. అనే స్థాయిలో తిరుపతి ఉప ఎన్నికపై వైసీపీ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అవసరమైతే ముందు అనుకున్న అభ్యర్థిని మార్చి అయినా, తిరుపతి ఉప ఎన్నికని రికార్డు స్థాయి మెజార్టీతో గెలవాలన్న ఆలోచనతో వైసీపీ అధిష్టానం వుందట.