తిరుపతి ఉప ఎన్నిక వైసీపీ వాలంటీర్లకు బీజేపీ పేజ్ ప్రముఖ్‌లకూ మధ్య యుద్ధంలా మారనుందా.? అంటే, ఔననే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. అసలు వైసీపీ వాలంటీర్ వ్యవస్థ అనేది బీజేపీ పేజ్ ప్రముఖ్ వ్యవస్థ నుంచే వచ్చిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బూత్ స్థాయి కంటే మిన్నగా ఓటర్ లిస్టులోని పేజీల ఆదారంగా చేసుకుని, ప్రతి 15 మంది ఓటర్లకు ఓ పేజ్ ప్రముఖ్‌ని ఎంపిక చేసి, ఆ పేజీలో వున్న మిగతా ఓటర్లను ప్రభావితం చేయడమే బీజేపీ పేజ్ ప్రముఖ్ ఉద్దేశ్యం. ఈ పేజ్ ప్రముఖ్ వ్యవస్థ ఉత్తర భారతదేశంలో జరిగిన పలు ఎన్నికల్లో బాగా ఉపయోగపడిందనీ, అదే వ్యూహాన్ని దక్షిణాదికీ ఆపాదించబోతున్నామనీ బీజేపీ చెబుతోంది.
వాలంటీర్ వ్యవస్థ అనేది ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటయినా, 90 శాతం పైగా వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలేనని వైసీపీ ముఖ్య నేతలే చెబుతున్నారు. 50 ఇళ్ళను లక్ష్యంగా చేసుకుని వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తోన్న సంగతి తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థతో పోల్చితే, పేజ్ ప్రముఖ్ వ్యవస్థ ఇంకా వేగంగా, సమర్థవంతంగా ఓటర్ల దగ్గరకు వెళ్ళేందుకు ఆస్కారముంది. అయితే, కేవలం ఈ వాలంటీర్ లేదా పేజ్ ప్రముఖ్ వ్యవస్థ కారణంగానే పార్టీలకు ఓట్లు పడతాయా.? అన్నది మళ్ళీ వేరే చర్చ. పంచాయితీ, మునిసిపల్ ఎన్నికల సమయంలో వాలంటీర్లు, ఓటర్లను బ్లాక్ మెయిల్ చేయడానికి బాగా ఉపయోగపడ్డారనీ, తద్వారా అధికార వైసీపీ గెలుపు తేలికయ్యిందనే వాదన లేకపోలేదు. ప్రభుత్వ వ్యవస్థ అయినా, పార్టీ వ్యవస్తలా.. వాలంటీర్ల వ్యవస్థ పనిచేస్తున్న మాట వాస్తవం. బీజేపీ చెబుతున్న పేజ్ ప్రముఖ్ వ్యవస్థ పూర్తిగా పార్టీ వ్యవహారం. పైగా, రాష్ట్రంలో బీజేపీకి వున్న సీన్ చాలా చాలా తక్కువ. ఒకవేళ తిరుపతిలో బీజేపీ పేజ్ ప్రముఖ్ వ్యవస్థ సక్సెస్ అయితే మాత్రం, రాష్ట్రంలో ఇదొక పెను సంచలనమవుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.