అమరావతి ప్రాంతంలో కూడా వైసిపి విజయం

YSRCP victory in Amravati panchyat elections
తొలివిడత పంచాయితీ ఎన్నికల ఫలితాలు వచ్చాక అమరావతి ఉద్యమం మీద నీలినీడలు కమ్ముకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.  ఎప్పుడైతే జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చిందో, ఆ క్షణం నుంచే రైతుల ఉద్యమం అంటూ ఇరవై తొమ్మిది రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఉద్యమం మొదలైంది.  ఆ ఉద్యమం రకరకాలుగా మలుపులు తిరుగుతూ హైకోర్టు, సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతూ కోట్ల రూపాయల ఫీజులను ఖరీదైన లాయర్లకు చెల్లిస్తూ ఏడాదినుంచి సాగిపోతున్నది.  పేదరైతులు ఇంత ఖరీదైన లాయర్లను నియమించుకుని న్యాయస్థానాల్లో పోరాడుతున్నారంటే వారి వెనుక తెలుగుదేశం పార్టీ లేదంటే నమ్మడం కష్టం.   లక్షల కోట్ల రూపాయల డబ్బులను కురిపిస్తాయని కన్న కలలు చెదిరిపోవడంతో  కొంతమంది అమాయక రైతులను ముందు కూర్చోబెట్టి తాము వెనకుండి డ్రామాను నడిపిస్తున్నారనేది వైసిపి వారు చేస్తున్న అభియోగం. 
 
YSRCP victory in Amravati panchyat elections
YSRCP victory in Amravati panchyat elections
అక్కడ జరిగేది అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు దెబ్బతిన్నవారు చేస్తున్న కుహనా ఉద్యమం అని అధికార వైసిపి ఆరోపిస్తున్నది.  దీక్షల పేరుతొ రోజూ పదిమందో, పాతికమందో టెంట్లు వేసుకుని కూర్చుని జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టడమే పనిగా ఉద్యమాన్ని సాగిస్తుంటే ఆ ఉద్యమ సెగలు అంతర్జాతీయస్థాయిని చేరుకున్నాయంటూ పచ్చ మీడియా ప్రజల కళ్ళకు గంతలు కట్టడానికి ప్రయత్నిస్తున్నది.  వాళ్ళు ఎంత గోల చేస్తున్నా, ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుని పోతున్నది.  చివరకు రైతుల పేరుతో ఉద్యమం చేస్తున్నవారు ఎంతకు సాహసించారంటే, రాజధాని కేసు విచారిస్తున్న ప్రధాన న్యాయమూర్తి బదిలీ అయి వెళ్లిపోతుంటే దాన్ని కూడా అడ్డుకోవాలని ప్రయత్నించేంత!  
 
మరి ఇంత హోరున అమరావతి ఉద్యమం సాగుతుంటే…ఉద్యమం గూర్చి వందోరోజు..రెండు వందల రోజులు..మూడు వందలు..నాలుగువందల రోజు అంటూ క్షుద్రమీడియాలో ఊదరగొడుతుంటే…రాజధాని గ్రామాలుగా చెప్పబడుతున్న మంగళగిరి, తెనాలి ప్రాంతాలతో సహా తాడేపల్లి లో కూడా వైసిపి అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయడం దేనికి సంకేతం?  
 
రాష్ట్రమంతా  వైసిపి గాలి వీచినా, కనీసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అయినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘనవిజయాన్ని సాధించి అమరావతి సెంటిమెంట్ ఉన్నదని రుజువు చేస్తారేమో అనుకుంటే…ఆ రెండు జిల్లాల్లో తొలివిడతగా జరిగిన 571  పంచాయితీల్లో తెలుగుదేశం మద్దతుదారులు గెలిచింది కేవలం 99 మాత్రమే.   472  స్థానాల్లో వైసిపి మద్దతుదారులు విజయం సాధించారు.  
 
అక్కడ అమరావతి సెంటిమెంట్ అనేది ఉంటే ఈ స్థాయిలో వైసిపి వారు గెలిచే అవకాశమే ఉండదు.  దీన్నిబట్టి చూస్తే అమరావతి రైతుల ఉద్యమం అనేది కేవలం తెలుగుదేశం ప్రాయోజిత కృత్రిమ ఉద్యమమే తప్ప సహజమైనది కాదని తేలిపోతున్నది.   ఇంకా మూడు విడుతలు ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ, మొదటి విడుత ఫలితాలు మాత్రం తెలుగుదేశం పార్టీకి తీవ్ర నిరాశను మిగిల్చగా, వైసిపి సంతోషానికి హద్దులు లేకుండా చేశాయి.  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు